Live Traffic Timings: ట్రాఫిక్ సిగ్నల్ టైమింగ్ లైవ్‌లో చూపిస్తున్న Mappls యాప్ - రెడ్ లైట్ పడే టైమ్ మీకు ముందే తెలుస్తుంది
Live Traffic Signal Timings: మీరు వెళ్లే దారిలో ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడు గ్రీన్ అవుతుందో, ఎప్పుడు రెడ్ అవుతుందో Mappls యాప్ లైవ్‌లో చెప్పేస్తుంది. వెహికల్ డ్రైవర్లకు ఇది ఒక స్మార్ట్ అప్‌డేట్.

Mappls App Live Traffic Signal Timings Bengaluru: భారతదేశ సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరు నగరం, స్మార్ట్ టెక్నాలజీతో మరో అడుగు ముందుకు వేసింది. ఈ నగరంలో, ఇప్పుడు, కూడళ్లలోని ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడు గ్రీన్‌లో ఉంటుంది, ఎప్పుడు రెడ్‌లోకి మారుతుంది, ఇంకా ఎన్ని సెకన్లు మిగిలి ఉన్నాయి వంటి వివరాలన్నీ మీకు ముందే తెలుస్తాయి. డ్రైవింగ్ లేదా రైడింగ్ చేస్తూ, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్నీ మ్యాపుల్స్ యాప్ (Mappls App) ద్వారా లైవ్‌గా చూడొచ్చు. తద్వారా, మన దేశంలో ఈ ఫీచర్ అమలవుతున్న మొట్టమొదటి నగరంగా బెంగళూరు నిలిచింది.
Mappls ఫీచర్‌ను బెంగళూరు ట్రాఫిక్ పోలీస్, ఆర్కాడిస్ ఇండియా (Arcadis India) & మాప్‌మైఇండియా (MapmyIndia) కలిసి అభివృద్ధి చేశారు. మ్యాపుల్స్ యాప్ మీ మొబైల్ ఫోన్‌లో ఉంటే, ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి, ఆ సిగ్నల్ కౌంట్‌డౌన్ ఆ యాప్‌లో కూడా రియల్‌టైమ్‌గా కనిపిస్తుంది. అంటే మీరు గ్రీన్ లైట్ కోసం ఎంత సేపు ఆగాల్సి ఉంటుందో ముందుగానే తెలిసిపోతుంది. అదే విధంగా, రెడ్ సిగ్నల్ ఎంతసేపట్లో పడుతుందో కూడా మీకు ముందుగానే అర్ధం అవుతుంది. దీనివల్ల, మీరు ఆ కూడలి దగ్గరకు ఆగాల్సిన అవసరం లేకుండా, మీ వాహన వేగాన్ని తగ్గించడం లేదా పెంచడం ద్వారా గ్రీన్ సిగ్నల్ ఉన్న సమయంలోనే ఆ కూడలిని దాటేయవచ్చు. అంతేకాదు, మీ దారి మార్చుకోవడం ద్వారా రెడ్ సిగ్నల్ లేని వేరే రూట్ నుంచి గమ్యాన్ని చేరుకోవచ్చు.
లైవ్ సిగ్నల్ టైమింగ్ ఎలా పనిచేస్తుంది?
ప్రస్తుతం బెంగళూరులోని 169 ట్రాఫిక్ సిగ్నల్స్ ఈ సిస్టమ్‌తో కనెక్ట్ అయ్యాయి. ఇవి సెన్సార్లు ఉన్న AI ఆధారిత VAC (Vehicle Actuated Control) జంక్షన్లు. ట్రాఫిక్ వాల్యూమ్ ఆధారంగా టైమింగ్ ఆటోమేటిక్‌గా సర్దుబాటు అవుతుంది. సిగ్నల్ ఆటోమేటిక్ మోడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే మ్యాపుల్స్ యాప్‌లో కౌంట్‌డౌన్ కనిపిస్తుంది. మాన్యువల్ మోడ్‌లో ఉన్నప్పుడు లేదా కనెక్షన్ కోల్పోతే, టైమర్ కనిపించదు.
“మ్యాజికల్ అండ్ హెల్ప్‌ఫుల్” - MapmyIndia CEO
మాప్‌మైఇండియా CEO రోహన్ వర్మ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఈ ఫీచర్‌ను షేర్ చేస్తూ, “రియల్‌టైమ్ సిగ్నల్ టైమింగ్ యాప్‌లో కనిపించడం మ్యాజికల్, హెల్ప్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్” అని రాశారు. ఆయన పోస్ట్‌కి లక్షల వ్యూస్ వచ్చాయి.
రోహన్ వర్మ చెప్పినట్లు, డ్రైవర్ ఒక జంక్షన్‌కి అర కిలోమీటరు దూరంలో ఉన్నప్పటికీ, సిగ్నల్ ఎంతసేపట్లో మారుతుందో తెలుసుకోవచ్చు. ఇది రోజువారీ డ్రైవింగ్‌లో, ముఖ్యంగా ఎమర్జెన్సీ సిట్యుయేషన్లలో చాలా ఉపయోగపడుతుంది.
దేశంలో మొదటిసారిగా Mappls ఫీచర్
Mappls యాప్, ఈ ఫీచర్‌తో ఇండియాలో తొలి నావిగేషన్ యాప్‌గా నిలిచింది. ట్రాఫిక్ ఫ్లో, సేఫ్టీ అలర్ట్స్, లైవ్ రూట్ అప్‌డేట్స్ వంటి ఇతర టూల్స్‌తో కలిపి స్మార్ట్ సిటీలకు ఒక కొత్త టెక్నాలజీ అనుభవాన్ని అందిస్తోంది.
భవిష్యత్తులో మరిన్ని నగరాలకు
డ్రైవర్లకు ఇకపై “రెడ్ సిగ్నల్ ఎప్పుడు గ్రీన్ అవుతుంది?” అనేది కేవలం అంచనాగా మిగిలిపోదు, Mappls యాప్ లైవ్‌లో కరెక్ట్‌గా చెప్పేస్తుంది. బెంగళూరు విజయవంతమైన తర్వాత, ఈ సిస్టమ్‌ను ముంబై, హైదరాబాద్, దిల్లీ వంటి ఇతర మెట్రో నగరాల్లో కూడా ప్రవేశపెట్టాలని మాప్‌మైఇండియా ప్రణాళిక రూపొందిస్తోంది.





















