కొత్త బంపర్, కొత్త గ్రిల్, కొత్త కలర్‌తో షోరూమ్‌ల్లోకి 2026 MG Hector - ధరలో స్వల్ప మార్పు మాత్రమే!
2026 MG Hector జనవరిలో మార్కెట్‌లోకి రానుంది. కొత్త గ్రిల్, కొత్త బంపర్, అదనపు ఫీచర్లతో ఎక్స్-షోరూమ్ ధరలో స్వల్ప పెంపు ఉండొచ్చు. AP, TG బయ్యర్ల కోసం పూర్తి వివరాలు.

2026 MG Hector Facelift: 2026 MG Hector కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లలో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. MG Motor India ఇప్పటికే రెండు టీజర్లను విడుదల చేసింది. అవి చూస్తుంటే ఈసారి Hectorలో పెద్ద మార్పులు కాకపోయినా... బయటి లుక్‌లో ఆకర్షణీయమైన అప్‌డేట్స్, చిన్నపాటి అదనపు ఫీచర్ కనిపించబోతున్నాయి. ముఖ్యంగా AP, Telangana బయ్యర్లను దృష్టిలో పెట్టుకుని, 2026 Hector గురించి ఇప్పటివరకు వెల్లడైన అన్ని వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. డిసెంబర్ 15న ఈ కారును పరిచయం చేయనున్నారు, జనవరిలో మార్కెట్‌లోకి రావచ్చు.
బయటి డిజైన్ ఎలా ఉండబోతోంది?
2026 MG Hectorలో అత్యంత గమనించదగ్గ మార్పు ఫ్రంట్ గ్రిల్‌లోనే ఉండొచ్చు. మొత్తం సైజ్ మారకపోయినా, గ్రిల్‌పై కొత్త హెక్సాగనల్ ప్యాటర్న్స్ మరింత స్టైలిష్‌గా కనిపిస్తున్నాయి. మధ్యలో ఉన్న MG లోగోకు ఇచ్చిన క్రోమ్ టచ్ SUVకి షార్ప్, పవర్‌ఫుల్ లుక్ ఇస్తుంది.
అలాగే ఫ్రంట్ బంపర్ కూడా కొత్త డిజైన్‌తో రాబోతోందని టీజర్ చెబుతోంది. దిగువనున్న స్కిడ్ ప్లేట్ మరింత స్పష్టంగా, SUV తరహా వ్యక్తిత్వాన్ని ఇస్తోంది. హెడ్‌ల్యాంప్స్ ఆకారం మార్చకపోయినా, వాటిలోని LED DRLs ప్యాటర్న్‌ను రిఫ్రెష్ చేశారు. మరో ముఖ్యమైన అప్‌డేట్ - కొత్త బ్లూ కలర్. ఇదివరకు Hectorలో లేని ఈ కలర్ కుటుంబ కొనుగోలుదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది.
లోపల మార్పులు ఏమిటి?
ఇంటీరియర్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. 2023లో Hectorకు ఇంటీరియర్‌లో భారీగా అప్‌డేట్ ఇచ్చారు కాబట్టి, మళ్లీ పూర్తిగా రీడిజైన్ చేయడం అవసరమని MG భావించలేదు. ప్రస్తుతమున్న 5, 6, 7-సీటింగ్ లేఅవుట్లు అలాగే కొనసాగుతాయి.
అయినా, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో చిన్నపాటి బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 14-ఇంచుల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ Apple CarPlay & Android Autoతో పాటు మరికొన్ని కనెక్టివిటీ ఫీచర్లు జోడించే అవకాశం ఉంది. కొత్త అపోహోస్టరీ కూడా వచ్చే అవకాశముంది. టాప్ వేరియంట్‌ల్లో పానోరామిక్ సన్‌రూఫ్, LED అంబియెంట్ లైటింగ్, పవర్డ్ & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు అలాగే కొనసాగుతాయి.
ఇంజిన్ సెటప్‌లో ఏమైనా మార్పులున్నాయా?
ఇంజిన్ ఎంపికలు మాత్రం అదే. 1.5-లీటర్ పెట్రోల్ (143hp, 250Nm) మాన్యువల్ & CVT ఆప్షన్లతో ఉంటాయి. 2.0-లీటర్ డీజిల్ (170hp, 350Nm) మాత్రం కేవలం మాన్యువల్‌లోనే అందుబాటులో ఉంటుంది. ఈ సెటప్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రోడ్లకు ఇప్పటికే పరిచయమైన కాంబినేషన్.
ధర ఎంత ఉంటుందో?
తెలుగు రాష్ట్రాల్లో, ప్రస్తుతం Hector ఎక్స్-షోరూమ్ ధరలు ₹14.00 లక్షల నుంచి ఉన్నాయి. 2026 మోడల్‌లో ధరలు పెద్దగా పెరగవని తెలుస్తోంది - వేరియంట్ ఆధారంగా సుమారు ₹15,000 నుంచి ₹25,000 వరకూ స్వల్ప పెంపు ఉండొచ్చు.
ఎవరెవరు రైవల్స్?
2026 Hectorకి ప్రధాన పోటీదారులు Tata Harrier, Jeep Compass. Hector Plus మాత్రం Mahindra XUV 7XO, Hyundai Alcazar, Tata Safariతో పోటీ పడుతుంది. MG నుంచి అధికారిక లాంచ్ డేట్ రాలేదు, కానీ జనవరి 2026లో షోరూమ్‌ల్లోకి వచ్చే అవకాశమే ఎక్కువ.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















