Effects of Shani Dev 2024 to 2025: ఈ ఏడాదంతా ఏల్నాటి శని, అష్టమ శని ఉన్న రాశులివే!
Effects of Saturn 2024: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో శని సంచార ప్రభావం ఏ ఏ రాశులపై ఉంది... శని సంచరించే సమయంలో ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం..
Effects of Shani Dev 2024 to 2025: అన్ని గ్రహాలు నెలకోసారి రాశిమారితే శనిమాత్రం రెండున్నరేళ్లకోసారి రాశి మారుతాడు. నెమ్మదిగా సంచరిస్తాడు కాబట్టే శనిని మందరుడు అంటారు. జన్మ రాశి నుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏలినాటి శని అంటారు...మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని దీనిని ఏల్నాటి శని అంటారు. జన్మరాశి నుంచి నాలుగో రాశిలో శని సంచారాన్ని అర్ధాష్టమ శని అంటారు. జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏ ఏ రాశులవారికి ఏలినాటి శని ఉంది, ఏఏ రాశులవారికి అష్టమ శని, అర్ధాష్టమ శని ఉంది? ఈ సమయంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం...
Also Read: ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటే ఏం జరుగుతుంది
కర్కాటక రాశి
శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశివారికి అష్టమ శని నడుస్తోంది. ఈ ప్రభావం ముఖ్యంగా మీ ఆరోగ్యంపై ఉంటుంది , వాహన ప్రమాద సూచనలున్నాయి జాగ్రత్త. గురుబలం ఉండడం వల్ల మీ గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు రాదు. మీరున్న రంగంలో మంచి వృద్ధి సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. కుటుంబంలో ఉండే వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీలో ఉండే ధైర్యం సడలిపోదు. పైగా కొన్నేళ్లుగా వెంటాడుతున్న సమస్యలు తొలగిపోతాయి. అయితే అష్టమ శని ప్రభావం వల్ల చేపట్టిన ప్రతిపనిలోనూ చిన్న చిన్న చికాకులు తప్పవు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అర్ధాష్టమ శని ఉంది. ఈ ప్రభావంతో కుటుంబ సభ్యులతో మనస్పర్థలు ఎదురవుతాయి. తీవ్రమైన కలతలు వస్తాయి కానీ ఆఖరి నిముషంలో మళ్లీ సర్దుకుంటాయి. అయితే ఈ రాశివారికి కూడా గురు గ్రహ సంచారం అనుకూల ఫలితాలను ఇస్తోంది. వాస్తవానికి చాలా సంవత్సరాల తర్వాత వృశ్చిక రాశివారికి శ్రీ క్రోధినామ సంవత్సరం కలిసొస్తుంది. గురుడు ఏడో స్థానంలో, రాహు కేతువులు 5,11 స్థానాల్లో ఉండడం వల్ల మీరున్న రంగంలో రాణిస్తారు. కష్టానికి ఫలితం అందుకుంటారు..కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ మానసిక ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అర్థాష్టమ శని ఉన్నప్పటికీ ఆ ప్రభావం మీపై పెద్దగా ఉండదు.
మకర రాశి
మకర రాశివారికి ఈ ఏడాది మొత్తం ఏల్నాటి శని ఉంది. ఫలితంగా ఎంతో కష్టపడితే కానీ మంచి ఫలితాలు సాధిస్తారు, ఆదాయం బావున్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మీకున్న పట్టుదలతో అనుకున్న కార్యాలు సాధిస్తారు. ప్రయాణ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే మిగిలిన గ్రహాల అనుకూల ఫలితాల వల్ల వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. ఓవరాల్ గా మకర రాశి వారికి ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకూ బావుంటుంది కానీ ఆ తర్వాత ఆరు నెలలు సమస్యలుంటాయి.
కుంభ రాశి
కుంభరాశి వారికి ఏల్నాటి శని కొనసాగుతోంది. ఫలితంగా మొదటి 6 నెలలు పర్వాలేదు అనిపించినా..అక్టోబరు నుంచి కష్టాలు మొదలవుతాయి. ఏదో తెలియని భయం వెంటాడుతుంది, అనారోగ్య సమస్యలు తప్పవు, అనుకోని వివాదాలు చుట్టుముడతాయి. చేపట్టిన పని పూర్తైనట్టే ఉంటుంది కానీ ఆశించిన ఫలితం రాదు. కష్టానికి తగిన ఫలితం పొందలేరు. మీ మంచితనమే మీకు సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది.
మీన రాశి
మీన రాశివారికి ఏల్నాటి శని ఉంది. రాహు కేతువులు శుభ స్థానాల్లో లేరు. ఫలితంగా మీ వ్యక్తిగత విషయాల్లో మీకు ధైర్యం చాలా తక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తప్పవు. సంపాదన బాగానే ఉంటుంది కానీ ఖర్చు అంతకుమించి ఉంటుంది. శ్రీ క్రోధినామ సంవత్సరం ఆరంభంలో ఇబ్బందులున్నా గురుబలం ఉండడం వల్ల నెమ్మదిగా సర్దుకుంటాయి. అక్టోబరు నుంచి మంచి రోజులు మొదలవుతాయి.. శత్రువులు స్నేహితులుగా మారుతారు. గౌరవం పెరుగుతుంది, అనుకున్న పనులు పూర్తిచేస్తారు. వృత్తి , ఉద్యోగాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.