YV Subbareddy : జగన్ ఉపఎన్నికలకు వెళ్లబోతున్నారా ? - వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన క్లారిటీ ఇదిగో
YSRCP : వైఎస్ జగన్ ఉపఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటి ఆలోచనే లేదని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
Jagan : ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్ ఇటీవల హాట్ టాపిక్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కడపలో ఉపఎన్నిక వస్తే ఊరూరా తిరిగి షర్మిల కోసం ప్రచారం చేస్తానని ప్రకటించారు. దీంతో కడప ఉపఎన్నికపై ఒక్కసారి చర్చ ప్రారంభమయింది. జగన్ ఎమ్మెల్యేగా ఉండటం కన్నా ఎంపీగా వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారని అందుకే అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి తాను ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నారని విస్తృతమైన చర్చ జరిగుతోంది. ఈ అంశంపై ఆ పార్టీ ముఖ్య నేతలెవరూ ఇప్పటి వరకూ స్పందించలేదు. తాజాగా బుధవారం ఒంగోలు పర్యటనకు వచ్చిన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ అంశంపై స్పందించారు. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. ఉపఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్ లేరని ఇదంతా టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం మాత్రమేనన్నారు. వైవీ సుబ్బారెడ్డి .. జగన్ కు అత్యంత సన్నిహితులు. పార్టీ వ్యూహాలను ఖరారు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఆయనే జగన్ ఎలాంటి ఉపఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని చెప్పడంతో అంతా పొలిటికల్ గాసిప్ గానే ఉపఎన్నికల హడావుడి మిగిలిపోనుంది.
ఇప్పటికిప్పుడు కాకపోయినా ఆ నాలుగైదు నెలల తర్వాత అయినా పరిస్థితి అనుకూలంగా ఉంటే.. ఉపఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని ఏపీ రాజకీయవర్గాలు ఇప్పటికీ నమ్ముతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో ఉన్న పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండటం కీలకం. సీఎంగా ఉన్నప్పుడు అధికార పార్టీ హోదాలో.. రాజ్యసభలో ఉన్న బలం దృష్ట్యా కేంద్రం సన్నిహితంగా ఉంది. అయితే ఇప్పుడు ఆయనకు పవర్ లేదు. ఈ కారణంగా తానే స్వయంగా రంగంలోకి దిగి ఢిల్లీలో పరిస్థితుల్ని చక్కదిద్దుకోవాలని జగన్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ప్రజలు ఎన్నికల్లో తీర్పు చెప్పి నెల రోజులు కూడా కానందున ఇప్పటికిప్పుడు తొందరపడటం మంచిదని కాదని.. ఈ అంశంపై ప్రజల్లో చర్చ జరగాలని జగన్ కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
వైసీపీకి 39 శాతం ఓట్లు వచ్చినా ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. ఇదే అంశాన్ని హైలెట్ చేసి.. ప్రజల్లోకి వెళ్లి తనను అవమానిస్తున్నారని ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తురని పోరాటం చేసి.. రాజీనామాలు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందు కోసం నాలుగు నుంచి ఆరు నెలల సమయం ఎదురు చూస్తారని భావిస్తున్నారు. అందుకే వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడల్లా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని.. అంతా టీడీపీ ప్రచారం అని తేల్చేశారని అంటున్నారు.
ఘోర పరాజయం తర్వాత వైసీపీ శ్రేణులన్నీ నైరాశ్యంలో ఉన్నాయి. కడప జిల్లాలోనూ ప్రోత్సాహకరమైన ఫలితాలు రాలేదు. ఇలాంటి సమయంలో ఉపఎన్నికలు అంటే రిస్కేనని వైసీపీ క్యాడర్ కూడా భావిస్తోంది. అలాంటి ఆలోచనే లేదని వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇవ్వడంతో వారు కూడా ఊపిరి పీల్చుకున్నారు.