YSRCP MPs : పేదలపై సామాజిక దాడి - బినామీలతో అమరావతి ఉద్యమం .. చంద్రబాబుపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీల ఆగ్రహం !
చంద్రబాబు పేదలపై సామాజిక దాడి చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన వాటికోసం చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు అడగరని వారు ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పేదలపై సామాజిక దాడి చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు ఢిల్లీలో మండిపడ్డారు. దేశంలోనే కనీవినీ ఎరుగని సంక్షేమ కార్యక్రమాల ద్వారా.. రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళుతూ.. జాతీయ స్థాయిలో మంచి పరిపాలనా దక్షుడిగా, సంక్షేమ రథసారథిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పొందుతూంటే చంద్రబాబు మాత్రం దిగజారి విమర్శలు చేస్తున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణా రావు విమర్శించారు. చంద్రబాబు సొంత ఎజెండాతో అమరావతి రాజధానిని చేసి, తన వందిమాగధులంతా పెద్దఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి తెరలేపారన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను అస్తవ్యస్తం చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి చంద్రబాబు నెట్టారని.. ఆ పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టి ప్రతి ఒక్క హామీని అమలు చేశారన్నారు. కరోనాను సైతం ఎదుర్కొని ప్రజల సంక్షేమాన్ని చూశారన్నారు.
అమరావతి రాజధాని పరిరక్షణ పేరుతో యాత్రలు, సభలు నిర్వహిస్తున్నవారు పూర్తిగా చంద్రబాబు బినామీ వ్యక్తులని మోపిదేవి ఆరోపించారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, ఒక ప్రాంతంలోనే అభివృద్ధి కేంద్రీకరించకూడదనే ఉద్దేశంతో మూడు రాజధానుల నిర్ణయం జగన్ తీసుకున్నారన్నారు. రాయలసీమ , విశాఖ ప్రాంతం అభివృద్ధి చెందటం చంద్రబాబుకు ఇష్టం లేదా.. అని ఎంపీ ప్రశ్నించారు. సామాజిక మార్పు తీసుకురావడం కోసం, పేదల బాగు కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఓటీఎస్ పథకం, ఇళ్ల నిర్మాణాలు, ఇంగ్లిష్ మీడియం వంటి నిర్ణయాలు అమలు కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే... టీడీపీ ఎంపీలు ఆంధ్ర రాష్ట్రంలో నేరాలు-ఘోరాలు జరిగిపోతున్నాయన్నట్టుగా, కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏ విధమైన సహాయ, సహకారాలు చేయడానికి వీల్లేదన్నట్టుగా ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు.
Also Read: పీఆర్సీ కూడా ప్రకటించలేదు ... ఉద్యమం నిలిపివేత ! ఏపీ ఉద్యోగ నేతలు ఏం సాధించారు ?
14 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క విలువైన సలహా కూడా ప్రభుత్వానికి ఇవ్వలేదన్నారు. అమరావతి రాజధాని పరిధిలో 29 గ్రామాలపై చంద్రబాబుకు నిజంగా అభిమానం ఉంటే... వారికి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని మరో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను రైతుల దగ్గర లాక్కొని మోసం చేశారన్నారు. రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, ఆ భూములను అమ్ముకోవాలనే దురుద్దేశం చంద్రబాబుకు ఉంది కాబట్టే, ఎక్కడ తన కుట్రలు బయటపడతాయని.. వారికి మేలు చేస్తున్నట్టు నటిస్తూ చిందులు వేస్తున్నారని విమర్శించారు. అమరావతి యాత్రలు ద్వారా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు.. జనాభా దామాషా ప్రకారం 58 శాతం ఉద్యోగులను, అప్పులను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. కానీ, ఆదాయం మాత్రం 58 శాతం ఇవ్వలేదు. రెవెన్యూ లోటు కూడా ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్ నుంచి విడుదల చేస్తామని చెప్పి, అదీ ఇవ్వటం లేదు, ఇది చాలా అన్యాయమని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు వాపోయారు. చంద్రబాబు హయాంలో చేసిన అప్పుల వల్ల ప్రతి ఏడాది రూ. 25 వేలకోట్లు వడ్డీగా చెల్లించాల్సి వస్తోందన్నారు. చంద్రబాబు ఢిల్లీ వచ్చి, ప్రత్యేక హోదా ఇవ్వండి, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు ఇవ్వండి, పోలవరం రివైజ్డ్ నిధులు ఇవ్వండి అని కేంద్రాన్ని ఏ ఒక్క రోజు కూడా అడగలేదన్నారు.
Also Read: బాలయ్య ఇలాకాలో వైసీపీ నేతల డిష్యుం డిష్యుం! ఇలాగైతే కష్టమే..!
కోవిడ్ వల్ల అనుకున్న విధంగా పారిశ్రామిక వృద్ధి జరగలేదని మరో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అ్నారు. జగన్ సీఎంగాఉన్న రెండున్నరేళ్లలో ఏడాదిన్నర కోవిడ్ ఉందని... కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. జీఎస్టీ బకాయిలు కూడా ఇవ్వడం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా.. సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళుతున్నారని మాగుంట అన్నారు. పారిశ్రామిక వృద్ధి ఒక్క మన రాష్ట్రంలోనే కాదు. యావత్తు దేశంలోనే తగ్గింది. కొవిడ్ సమయంలో పారిశ్రామికవేత్తలు వెనక్కి తగ్గుతున్నారని గుర్తు చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, హక్కులపై సీనియర్ నేత అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు అడగరని ప్రశ్నించారు.
Also Read: ఇడుపులపాయ టు తాడేపల్లికి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ! వాళ్లకేం కష్టం వచ్చిందంటే ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి