(Source: ECI/ABP News/ABP Majha)
YSRCP MLC : గుండెపోటుతో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మృతి.. సంతాపం ప్రకటించిన సీఎం జగన్ !
వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కరీమున్నీసా గుండెపోటుతో మరణించారు. ఆమె మృతికి సీఎ జగన్ సంతాపం తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కరీమున్నీసా గుండెపోటుతో చనిపోయారు. మండలి సమావేశాలకు హాజరైన ఆమెకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రెండు రోజులుగా ఆమె శాసనమండలి సమావేశాలకు హాజరవుతున్నారు. శుక్రవారం రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన కొద్ది సేపటికి ఆమె ఆరోగ్యం విషమించింది. వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.
కరీమున్నీసా విజయవాడ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. వైఎస్ఆర్‌సీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. విజయవాడ 54వ డివిజన్ కార్పొరేటర్ గా కూడా ఆమె పనిచేశారు. మరోసారి ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ కూడా వేశారు. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీఎం జగన్ అనూహ్యంగా కృష్ణా జిల్లా నుంచి కరీమున్నీసాను ఎంపిక చేశారు. దరఖాస్తు చేసుకోకపోయినా సీఎం జగన్ పిలిచి అవకాశం ఇచ్చారని కరీమున్నీసా.. ఆమె కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో కార్పొరేటర్‌గా పోటీ విరమించుకుని ఎమ్మెల్సీ అయ్యారు.
ఎమ్మెల్సీగా పదవి చేపట్టి మండలి సమావేశాలకు తొలి సారి హాజరయ్యారు. హాజరైన రెండో రోజే ఆమె గుండెపోటుకు గురయ్యారు.కరీమున్నీసా మృతిపై ముఖ్యమంత్రి జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విజయవాడలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతిభావంతమైన నాయకురాలిగా, కార్పొరేటర్ నుంచి మండలి సభ్యురాలిగా ఎదిగారన్నారు.
Also Read: AP Chandra Babu : మళ్లీ గెలిచాకే అసెంబ్లీకి వెళ్తా.. కుటుంబాన్ని అవమానించారని విలపించిన చంద్రబాబు !
ఎమ్మెల్సీ హఠాత్తుగా చనిపోవడంతో విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే నాయకురాలు దూరం కావడం బాధాకారమన్నారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎమ్మెల్సీకి నివాళులు అర్పించారు.