YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
అమరావతి: జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో వైఎస్సార్ సీపీ విలీనంపై నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనంపై వైసీపీ అసంతృప్త నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లి కాంగ్రెస్ లో పిల్ల కాంగ్రెస్ (వైసీపీ) కలిసిపోతుంది అని వైసీపి అసంతృప్త నేత, మాజీ మంత్రి బాలినేని వ్యాఖ్యానించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిళ అడ్డుపడకుంటే... ఇప్పటికే కాంగ్రెస్ లో వైఎస్ జగన్ పార్టీ వైసీపీ విలీనం అయ్యేదని బాలినేని అన్నారని ప్రచారం జరుగుతోంది. మహా అయితే వచ్చే సంవత్సరం అయినా వైసీపీ, కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతుందని.. ఏదో ఓరోజు హస్తం పార్టీలో వైఎస్సార్ సీపీ విలీనం కన్ఫామ్ అంటూ బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. బాలినేని కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే కాంగ్రెస్ లో వైసీపీ విలీనం వ్యాఖ్యలపై అటు హస్తం పార్టీ నేతలు, ఇటు జగన్ పార్టీ నేతలు గానీ స్పందించలేదు. మరోవైపు బాలినేని చేశారంటున్న కామెంట్లపై ఆయన స్పందించి క్లారిటీ ఇస్తారా, లేక కన్ఫామ్ చేస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది.