YSRCP Audio Tapes : వైఎస్ఆర్‌సీపీలో టేపుల గోల ! ఎవరు చేస్తున్నారు..? ఎందుకు చేస్తున్నారు...?
అవంతి శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొద్ది రోజుల క్రితం అంబటి రాంబాబు.. ఏడాదిన్నర క్రితం ఫృధ్వీ ఆడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ ఎలా బయటకు వస్తున్నాయి?
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు ఆడియో ఫోబియాకు గరవుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరి ఆడియో టేప్ బయటకు వస్తుందోనని బిక్కు బిక్కుమంటున్నారు. దీనికి కారణం సీరియల్‌గా లీడర్ల ఆడియో టేపులు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉండటమే. అవన్నీ పరువు తీసేవి కావడమే. ఆ ఆడియో టేపులు బయటకు వచ్చిన ఇక చెప్పుకోవడానికి ఏమీ ఉండటం లేదు. స్పందిస్తే ఓ తంటా.. స్పందించకపోతే ఓ తంటా..!
"వైరల్" టేపు కుట్రగా మంత్రి అవంతి అనుమానం..!
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ ఓ మహిళతో మాట్లాడిన ఆడియో టేపులంటూ సోషల్ మీడియాలో ఒక్క సారిగా హైలెట్ అయ్యాయి. వరుసగా రెండు ఆడియో టేపుల్ని విడుదల చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఎక్కడ నుంచి విడుదలయ్యాయో కానీ సహజంగానే ఆయన రాజకీయ ప్రత్యర్థులు వాటిని వైరల్ చేశారు. వీటిపై ఆయన రాత్రి పది గంటల సమయంలో ప్రెస్‌మీట్ పెట్టారు. తనపై రాజకీయ కుట్ర చేస్తున్నారని పరువు తీసేందుకే ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చారు. అయితే ఆ ఆడియో టేపులు ఆయనవేనని సోషల్ మీడియాలో ఖరారు చేసి మరీ కొంత మంది ప్రచారం చేస్తున్నారు. ఆయన ఫిర్యాదుపై పోలీసులు శరవేగంగా స్పందించలేదు. విచారణ ప్రారంభించారో లేదో కూడా స్పష్టత లేదు.
ఎమ్మెల్యే్ అంబటి కూడా "అలాంటి కుట్ర" బాధితుడే..!
ఈ పరిస్థితి ఒక్క అవంతి శ్రీనివాస్‌ది మాత్రమే కాదు .. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కూడా ఇదే పరిస్థితి ఎదురయింది. ఆయన ఓ మహిళ గురించి మాట్లాడారంటూ రెండు వారాల కిందట ఓ ఆడియో సోషల్ మీడియాలోనే వైరల్ అయింది. అచ్చంగా ఇప్పుడు మంత్రి అవంతి స్పందించినట్లుగానే అప్పుడు అంబటి రాంబాబు కూడా స్పందించారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలను ఎదుర్కొంటానని ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే ఇవి కుట్రలు అయితే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారా..? చేస్తే విచారణ ఎందుకు చేయలేదు..? వంటి అంశాలపై మాత్రం స్పష్టత లేదు.
మొదటి విక్టిమ్ ధర్టీ ఇయర్స్ " ఫృధ్వీ"
వీరిద్దరే కాదు దాదాపుగా ఏడాదిన్నర కిందట ఎస్వీబీసీ చానల్ చైర్మన్‌గా ఉన్న సినీ నటుడు ఫృధ్వీ ఆడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. చానల్ ఉద్యోగితో ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఆడియోలు అవి. అప్పుడు కూడా దర్యాప్తు జరిపించారు. ఆ ఆడియోలు అబద్దమని ఫృధ్వీ వాదించారు. కానీ విచారణలో ఏం తేలిందో బయట పెట్టలేదు. అయితే ఫృధ్వీ మాత్రం రాజీనామా చేసి మళ్లీ సినిమా రంగంలో చాన్సులు వెదుక్కుంటున్నారు. తనపై కుట్ర జరిగిందని ఆయన అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో.. ఇతర కార్యక్రమాల్లో ప్రకటనలు చేస్తూ ఉంటారు.
కుట్రలను పోలీసులు ఎందుకు ఛేదించడం లేదు..?
అందరూ అధికార పార్టీ నేతలే. వారి ఆడియోలు బయటకు వస్తున్నాయి. అందరూ తమపై కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇంత వరకూ ఆ కుట్రలు ఎవరు చేశారు..? ఆ మాటలు తమవి కావు అని ఆ లీడర్లు చెబుతున్నందున ఎవరు సృష్టించారు..? అనే వాటిని తెలుసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మాములుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఇతర పార్టీలకు చెందిన వారు సోషల్ మీడియా పోస్టులు పెడితేనే సీఐడీ పోలీసులు ఊరుకోరు. అర్థరాత్రైనా వచ్చి అరెస్ట్ చేస్తారు. మహిళల్ని, వృద్ధుల్ని కూడా అలా అదుపులోకి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పెడుతూంటే .. ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదనే సందేహం సహజంగానే వస్తుంది.
నిజాలు బయటకు రాకూడదని బాధితులూ కోరుకుంటున్నారా..?
ఆ ఆడియో టేపులు నిజమైనవేనని పోలీసుల దర్యాప్తులో అదే తేలితే ఎదురుదాడి చేయడానికి కూడా అవకాశం ఉండదన్న కోణంలోనే పోలీసు దర్యాప్తు విషయంలో ఆయా నేతలు ఒత్తిడి చేయడం లేదన్న విమర్శలు రావడానికి ఈ పరిణామాలు కారణం అవుతున్నాయి. అదే సమయంలో ఆ టేపులు ఎక్కడ్నుంచి లీకయ్యాయన్నది కూడా చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ఆ మహిళలే లీక్ చేశారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. కానీ అధికార పార్టీ నేతలు అదీ కూడా మంచి పొజిషన్లలో ఉన్న వారికి ఎదురుతిరిగే ధైర్యం ఆ మహిళలు చేయగలరా అన్న చర్చ కూడా సహజంగానే నడుస్తోంది. సొంత పార్టీలోనే ఆయా పార్టీ నేతలపై కుట్ర జరిగిందని వారి అనుచరుల్లో ఎక్కువగా వినిపిస్తున్నమాట. కారణం ఏదైనా కానీ ఇలాంటి విషయాల్లో నిజాలు ఎప్పుడూ బయటకు రావు. ఊహాగానాలతోనే సరి పెట్టుకుంటారు. నిజాలు బయటకు తీయాలని ప్రభుత్వం అనుకోదు.. తీసుకు రావాలని ఆయన బాధిత నేతలు కూడా పట్టుబట్టారు. అందుకే అవి ఎప్పటికీ గాసిప్స్‌గానే ఉండిపోతాయి. నిజాలు వారికి మాత్రమే తెలుసు.