Nellore Police: ఈ ఘటన.. దిశ యాప్ ద్వారా ఎలా సాయం అందుతుందో చెప్పేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.. మీరూ చదవండి
దిశ యాప్ ద్వారా ఓ మహిళను, ఆమె కుమార్తెను కాపాడారు నెల్లూరు జిల్లా మర్రిపాడు పోలీసులు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్షణం స్పందించారు.
దిశ చట్టాన్ని తెచ్చామన్నారు కానీ, అది చట్టంగా రూపుదిద్దుకోలేదంటూ ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చాన్నాళ్లుగా విమర్శలు చేస్తున్నాయి. అదే సమయంలో దిశ యాప్ ద్వారా రాష్ట్రంలో ఓ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని చెబుతోంది ప్రభుత్వం. ప్రతి మహిళ మొబైల్ ఫోన్ లో దిశ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలని చెబుతోంది. దీనిపై విస్తృత ప్రచారం చేపట్టింది కూడా. దిశ యాప్ అత్యధిక డౌన్ లోడ్స్ తో రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు జిల్లా ప్రత్యేకంగా నిలిచింది. అంతే కాదు, దిశ యాప్ కి వచ్చే కాల్స్ కానీ, ఎస్ఓఎస్ బటన్ నొక్కడం ద్వారా వచ్చే అలర్ట్ లకు వెంటనే స్పందించడంలో కానీ నెల్లూరు పోలీసులు ముందున్నారు. దీనికి సంబంధించిన తాజా ఉదాహరణ మరోసారి దిశ యాప్ సమర్థతను నిరూపించింది. నెల్లూరు పోలీసుల సత్వర ప్రతిస్పందనకు లెక్కలేనన్ని అభినందనలు తెచ్చి పెట్టింది.
నెల్లూరు జిల్లా మర్రిపాడు జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఓ కారు ఆగిపోయింది. టైర్ పంక్చర్ కావడంతో కారుని నిర్మానుష్య ప్రదేశంలో నిలిపేయాల్సి వచ్చింది. ఆ కారులో తల్లి, ఆమె కుమార్తె ఉన్నారు. వారితోపాటు డ్రైవర్ కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఎవరైనా భయంతో వణికిపోతారు. ఏ వైపు నుంచి ఏ ఆకతాయిలు వచ్చినా.. ఏమీ చేయలేని పరిస్థితి. కారు కర్ణాటక నుంచి నెల్లూరు వైపు వస్తోంది. దగ్గర్లో తెలిసినవారు కూడా ఎవరూ లేరు. ఎవరికి సమాచారమిచ్చినా, అర్ధరాత్రి అర్జెంట్ గా వారి దగ్గరకు వచ్చి సహాయం చేస్తారని అనుకోలేం. కానీ ఆ మహిళకు ఓ ఆలోచన వచ్చింది. ఏపీలో దిశ యాప్ గురించి గతంలోనే విని ఉండటం, ఆమె సెల్ ఫోన్ లో కూడా యాప్ ఉండటంతో.. వెంటనే ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేసింది. దీంతో సమీపంలోని పోలీస్ స్టేషన్ కి సమాచారం వెళ్లింది. కాల్ చేస్తే.. తమ పరిస్థితిని వివరించింది ఆ తల్లి.
సరిగ్గా పది నిముషాల్లోనే..
సరిగ్గా SOS బటన్ ప్రెస్ చేసి పది నిముషాల్లోనే వారి ముందు పోలీస్ జీపు ఆగింది. ఎస్సై వెంకట రమణ వారి లొకేషన్ ట్రాక్ చేసి అక్కడికి వచ్చారు. ఆయన వెంట స్టేషన్ సిబ్బంది ఉన్నారు. వెంటనే వారు అక్కడ పరిస్థితి అర్థం చేసుకున్నారు. అక్కడికక్కడే డ్రైవర్ కి సాయం పట్టారు. మరొకరి సాయంతో వెంటనే టైర్ మార్పించారు. కారులో తల్లీ కూతుళ్లని అక్కడినుంచి జాగ్రత్తగా పంపించి వేశారు.
ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సహజంగా పోలీసులు ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందిస్తారు. కానీ స్థానికంగా ఉండే పోలీసుల ఫోన్ నెంబర్లు అందరి వద్దా ఉండవు. అర్ధరాత్రి 100 కాల్ సెంటర్ కి కాల్ వస్తే ఎలాంటి సమాధానం వస్తుందో తెలియదు. అయితే దిశ యాప్ అలా కాదు. దిశ యాప్ లో కంప్లయింట్ రిజిస్టర్ చేసినా, ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేసినా వెంటనే పోలీసులు స్పందిస్తారు. అర్ధరాత్రి అయినా.. సహాయం చేయడానికి ముందుకొస్తారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు పోలీసులు కూడా అదే పని చేశారు. ముఖ్యంగా ఎస్సై వెంకటరమణ చొరవను జిల్లా మహిళలు అభినందిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా దిశ యాప్ తో కలిగిన ఉపయోగాలకు ఇది ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ అని ప్రశంసిస్తున్నారు.
Also Read: Nellore News: నెల్లూరు జిల్లాలో కరోనా భయం... మూతపడ్డ సూళ్లూరుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం