Perni Nani: ప్రభుత్వ నిర్ణయం ఇబ్బందిగా ఉంటే సినిమాలు వాయిదా వేసుకోవచ్చు... ఆర్జీవీలా ఎవరైనా వచ్చి సలహాలు ఇవ్వొచ్చు... మంత్రి పేర్ని నాని
కోవిడ్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ నిర్ణయం ఇబ్బందికరంగా ఉంటే సినిమాలు వాయిదా వేసుకోవచ్చని సూచించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. ఒకవేళ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు ప్రభుత్వ నిర్ణయం ఇబ్బందికరంగా ఉంటే వాయిదా వేసుకోవాలని సూచించారు. డైరెక్టర్ ఆర్జీవీతో మంత్రి పేర్ని నాని ఇవాళ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. టికెట్ ధరల తగ్గింపుపై ఆర్జీవీలా ఎవరైనా వచ్చి తమతో మాట్లాడవచ్చన్నారు.
Also Read: టిక్కెట్ల వివాదం ముదరదు.. త్వరలోనే పరిష్కారం : సజ్జల
జీవో 100తో పోలిస్తే ఎక్కువ ధరలే
మంత్రి పేర్నినాని మాట్లాడుతూ... ప్రభుత్వం కూడా లాజిక్ లు చెబితే ఎదుటివారికి కష్టంగా ఉంటుందని, వ్యక్తుల అభిప్రాయాలను సంతృప్తిపరచటం కష్టం సాధ్యం అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. సినిమాటోగ్రఫ్రీ నిబంధనల మేరకే సినిమా టికెట్ల రేట్లు నిర్ణయించామన్నారు. 2013లో జారీ చేసిన జీవో 100తో పోలిస్తే ప్రస్తుతం ధరలు ఎక్కువగానే ఉన్నాయన్నారు. ఈ ధరలపై అభ్యంతరం ఉంటే కమిటీకి చెప్పొచ్చన్నారు. దర్శకుడు వర్మ ఇచ్చినట్లే ఎవరైనా సలహాలు ఇవ్వొచ్చని సూచించారు. కమిటీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. హోంసెక్రటరీతో కలిసి కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?
కోవిడ్ ఉద్ధృతి కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీ
కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న కారణంగానే థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్ణయం ఇబ్బంది ఉంటే సినిమాలు వాయిదా వేసుకోవచ్చన్నారు. కోవిడ్ కారణంగా ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకున్నాయని మంత్రి గుర్తుచేశారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వం తాజా నిర్ణయాలు తీసుకుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. తాము చట్ట విరుద్ధంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్జీవీకి చట్టం గురించి చెప్పానని వివరించారు. ఆర్జీవీతో జరిగిన నాలుగు గంటల భేటీలో పలు అంశాలపై చర్చించామన్నారు.
Also Read: నాలుగు గంటల భేటీ మధ్యలో రొయ్యల బిర్యానీ లంచ్ ! చివరికి ఏమి తేల్చారంటే ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి