(Source: ECI/ABP News/ABP Majha)
Chintamani Ban : చింతామణి నాటకంపై నిషేధం... తర్వాత కన్యాశుల్కం పైనా ! సంఘ సంస్కర్తలకు లభించే విలువ అంతేనా ?
ఏపీ ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధించింది. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ నాటకం .. సమాజంలో దురాచారాలు, మూఢనమ్మకాలు, దుస్సంప్రదాయాలపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసింది. కానీ ఇప్పుడు నిషేధ జాబితాలో చేరింది. ఎందుకిలా ?
ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటకంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడా చింతామణి నాటకాన్ని ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది. తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం చింతామణి. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా కవి కాళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారు. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకంపై నిషేధంతో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు
వందేళ్ల నాటకాన్ని నిషేధించే పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయా ?
చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర వైశ్యులను అవమానించేదిగా ఉందని తక్షణం ఆ నాటకాన్ని నిషేధించాలని కొంత కాలంగా ఆర్యవైశ్య సంఘాల సమావేశాల్లో తీర్మానాలు చేస్తూ వస్తున్నారు. చింతామణి నాటకం ఇప్పటిది కాదు. 1920 ప్రాంతంలో కాళ్ళకూరి నారాయణరావు రాశారు. ఆనాటి సాంఘిక దురాచారాలను, తప్పుడు సంప్రదాయాలను సంస్కరించేందుకు ఈ నాటకాన్ని అప్పటి పరిస్థితులను బట్టి రాశారు. నాటకాలే ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్న రోజుల్లో ఈ చింతామణి నాటకానికి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడంలో తన వంతు పాత్ర పోషించింది. అలాంటి నాటకం చరిత్రలో నిలిపోయింది. వందేళ్ల తర్వాత ఇప్పుడు ఆ నాటకాన్ని నిషేధించడం . అతిశయోక్తిగా ఉంది.
Also Read: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.... మద్యం దుకాణాల పనివేళలు మరో గంట పొడిగింపు
సుబ్బిశెట్టి పాత్ర ఓ సామాజికవర్గాన్ని కించ పరిచేలా ఉందా ?
ఆ నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర ద్వారా అసభ్య , అభ్యంతరకర డైలాగులు చెప్పించారని ఓ సామాజికవర్గం వారు ఆరోపిస్తున్నారు. నిజానికి అలాంటివేమీ లేవు. ఆ రోజుల్లో వాడే పదజాలంతోనే మాటలురాశారు. అయితే రాను రాను వ్యవహారిక భాష పేరుతో కొంతమంది నాటకంలో కొత్త మాటలు చొప్పించారు. వాటి వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. వాటిపై పోరాడితే తప్పేమీ ఉండేది కాదు.. కానీ పూర్తిగా నాటకాన్నే నిషేధించాలని డిమాండ్ రావడం.. ప్రభుత్వం అంగీకరించడం చాలా మంది కళాభిమానుల్ని ఆశ్చర్య పరిచింది. దాదాపుగా వందేళ్ల తర్వాత కొంత మందికి నాటకం అభ్యంతరకరంగా అనిపించింది. వందేళ్లుగా .. సంఘ సంస్కరణకు తన వంతు సాయపడిన నాటకాన్ని నిషేధించడం అంటే ఎవరికైనా ఇదేం పద్దతి అనిపించక మానదు.
Also Read: మద్యంపై వ్యాట్ తగ్గింపు.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..! ఏ బ్రాండ్ ఎంత తగ్గనుందంటే ?
ఇదే పద్దతిలో కన్యాశుల్కం నాటకాన్నీ నిషేధిస్తారా ?
ఒక్క చింతామణి నాటకం మాత్రమే కాదు ఆ రోజుల్లో సామాజిక దురాచారాలపై చైతన్యం తీసుకు రావడానికి ఎన్నో నాటకాలను ఊరూరా ప్రదర్శిచేవారు. వాటిలో కొన్ని అజరామజరంగా నిలిచాయి. వాటిలో చింతామణి ,కన్యాశుల్కం వంటివి ముఖ్యం. చింతామణి మీద నిషేధం తర్వాత కన్యాశుల్కం నాటకం మీద అభ్యంతరాలు రావన్న గ్యారంటీ ఏమీ లేదు. వస్తాయి కూడా. ఆ నాటకాన్ని కూడా నిషేధించాలని అందులో ప్రధాన పాత్రధారులయిన వర్గం వారు డిమాండ్ చేయవచ్చు. అప్పటి సంప్రదాయలు.. మూఢనమ్మకాలను పటా పంచలు చేసేలా.. సంఘ సంస్కరణను ఉద్దేశించి ఆ నాటకం రాశారు. ఆ వర్గాల నుంచి డిమాండ్ వస్తే చింతామణిని నిషేధించిన ప్రభుత్వానికి ... కన్యాశుల్కం నిషేధించడం పెద్ద విషయం కాదు.
నాటకాలే మృగ్యమైన ఈ రోజుల్లో నిషేధం మాట ఎందుకు !?
నాటక కళ అంతరించిపోయే దశలో ఉంది. ఎక్కడో ఒకటీ అరా జరుగుతున్నా.. అది ఖరీదైన ధియేటర్లలో జరిగే నాటకాలే..ఆధునిక కథలే కానీ.. చింతామణి నాటకాలు ఇప్పుడు ఎవరూ వేయడం లేదు. ఓ రకంగా అంపశయ్య మీద నాటక రంగం ఉంది. ఇలాంటి సమయంలో నాటక నిషేధం అంటే... ఆ రంగాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టడమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
సాంఘిక దురాచారలపై పోరాటం చేసిన సంస్కర్తలకు ఇది అవమానం కాదా ?
చింతామణి నాటకంపై నిషేధం విధించడం అంటే సమాజంలో పేరుకుపోయిన దుస్సంప్రదాయాలు, మూఢ నమ్మకాలు, దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్తలను అవమానించడమేనన్న అభిప్రాయం చాలా మందిలో ఏర్పడుతోంది. ఆ రోజుల్లో ఇలాంటి కథలు రాసి నాటకాలు వేసిన వాళ్లకు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. ఎంతో మంది చైతన్యవంతులయ్యారు. నిజానిజాలు తెలుసుకున్నారు. మూఢ నమ్మకాల నుంచి బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు దాన్ని నిషేధ జాబితాలో చేర్చడం అంటే సంఘ సంస్కర్తలను అవమానించడమే.
Also Read: ఏపీలో కరోనా విజృంభణ... కొత్తగా 4108 కోవిడ్ కేసులు... 30 వేలు దాటిన యాక్టివ్ కేసులు
రాజకీయ కారణాలతోనే నిషేధమా ?
హఠాత్తుగా చింతామణి నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించడానికి రాజకీయ పరమైన కారణాలే ప్రధాన పాత్ర పోషించాయని నమ్ముతున్నారు. ఇటీవలి కాలంలో ఏపీలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా... ఓ వర్గాన్ని మళ్లీ మంచి చేసుకోవాలంటే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో చింతామణి నాటకంపై కొన్ని సంఘాల డిమాండ్లు తెరపైకి తెచ్చారని భావిస్తున్నారు. అదే నిజమైతే ప్రభుత్వం వ్యూహాత్మక తప్పిదం చేసినట్లే అవుతుంది. ఏ నాటకం అయినా .. అందులో పాత్రలు అయినా ఏ వర్గాన్ని కించపరిచేలా ఉండవు. అప్పటి కాలమాన పరిస్థితులకు తగ్గట్లుగా ఆ పాత్రను తీర్చిదిద్దారు. ఈ విషయాన్ని ఆయా సామాజికవర్గాలకు చెందిన వారు అంగీకరిస్తారు. రాను రాజకీయం ప్రతి అంశంలోకి చొచ్చుకెళ్లి.. ప్రతీ చోటా రాజకీయ లబ్ది వెదుక్కునే పరిస్థితుల్లో ... చివరికి సంఘ సంస్కరణకు పాటుపడినవి కూడా నిషేధ జాబితాలోకి చేరాల్సి వస్తోంది.
Also Read: విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం... తరగతుల నిర్వహణపై మంత్రి ఆదిమూలపు కీలక వ్యాఖ్యలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి