Weather Updates: రెయిన్ అలర్ట్ - నేటి నుంచి 4 రోజులు అక్కడ భారీ వర్షాలు, IMD ఎల్లో వార్నింగ్
Rains In Andhra Pradesh: నేటి (అక్టోబర్ 31) రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో మొదట నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కోస్తా భాగాల్లోకి అల్పపీడనం ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
![Weather Updates: రెయిన్ అలర్ట్ - నేటి నుంచి 4 రోజులు అక్కడ భారీ వర్షాలు, IMD ఎల్లో వార్నింగ్ Weather Updates In Andhra Pradesh Telangana today 31 October 2022 Rain News Today Weather Updates: రెయిన్ అలర్ట్ - నేటి నుంచి 4 రోజులు అక్కడ భారీ వర్షాలు, IMD ఎల్లో వార్నింగ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/343f8f36f68d0427a7f9f6548df08b8a1667178563629233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rains in Telangana AP: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా.. తమిళనాడు, శ్రీలంక మీదుగా కొనసాగుతోంది. నేటి నుంచి అల్పపీడనం ప్రభావం చూపనుంది. అల్పపీడనంతో నేడు దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేటి (అక్టోబర్ 31) నుంచి ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించి అన్ని జిల్లాల్లోకి వ్యాపిస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలపగా, వాతావరణ కేంద్రం ఆ విషయాన్ని స్పష్టం చేసింది.
ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనాలతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 31 రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో మొదట నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కోస్తా భాగాల్లోకి అల్పపీడనం ప్రవేశిస్తుంది. తర్వాత నవంబర్ 1, 2, 3, నవంబర్ 4 వరకు ఈ వర్షాలు కొనసాగనున్నాయి. కానీ నవంబర్ 1, నవంబర్ 2 తేదీల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈసారి అల్పపీడనానికి ఉత్తర భాగంలో ఉపరితల ఆవర్తనం ఉండటం వలన వర్ష తీవ్రత కోస్తా భాగాల్లో ఉంటుంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 30, 2022
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాత్రిపూట చలి తీవ్రత పెరుగుతోంది. నేడు కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురవనున్నాయని తెలిపింది. నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో మూడు, నాలుగు రోజులపాటు వర్షాలున్నాయి. నవంబర్ తొలి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. హైదరాబాద్ లో ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 30 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదైంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
Weather warning of Andhra Pradesh for next 5 days Dated 30.10.2022. pic.twitter.com/4lZBNu2zvq
— MC Amaravati (@AmaravatiMc) October 30, 2022
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో అంతంతమాత్రంగానే ఉంటుంది. ఉపరితల ఆవర్తనం తమిళనాడు తీరంలో ఉండటంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉంది. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో నవంబర్ తొలి వారం నుంచే కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి నగరాల్లో తేలికపాటి వర్షాలున్నాయి. అయితే భారీ వర్షాలుండవు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్నిటికంటే తక్కువగా వర్షాలున్నాయి. నవంబర్ 2, నవంబర్ 3న వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. అన్నిటికంటే తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో వర్షాలున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం నవంబర్ 2, 3 చలి గాలులు వీచనున్నాయి. తెలంగాణలో ఇది వర్షాకాలం కాదు. తెలంగాణ - ఆంధ్ర సరిహద్దు భాగాల్లో మాత్రం నవంబర్ 2, 3 తేదీల్లో చినుకులు ఉండే అవకాశాలున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
2015 సంవత్సరం లో నెల్లూరు జిల్లాలో నవంబర్ నెలలో ఒకే రోజులోనే 200-250 మిల్లీమీటర్ల వరకు పలు భాగాల్లో వర్షపాతం నమోదయ్యింది. ఈ సారి అటు ఇటూ అలాగే ఉండనుంది. అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలున్నాయి. కానీ కోస్తా ప్రాంతాలకి ఆనుకొని ఉండే భాగాలు ముఖ్యంగా నెల్లూరు, సూళూరుపేట, కృష్ణపట్నం, చెన్నైకి దగ్గర ఉన్న ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు పడే అవకాశాలున్నాయి. మిగిలిన తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లా దక్షిణ భాగాల్లోనూ వర్ష సూచన ఉంది. కానీ అంత తీవ్రంగా వర్షాలు ఉండవు.
ఈ జిల్లాల్లో అత్యధికంగా నవంబర్ 1, 2 తేదీల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 3, 4 తేదీలలో సాధారణ వర్షాలున్నాయి.
ప్రకాశం, అన్నమయ్య జిల్లా, కడప, చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాల్లో, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. చిట్వేల్, ఒంగోలు, కందుకూరు, బద్వేల్, మచిలీపట్నం, అమలాపురం, నర్సాపురం లాంటి ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణం ఉంటుంది. నవంబర్ 1న మొదలుకానున్న వర్షాలు నవంబర్ 4న తగ్గుముఖం పడతాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)