Viveka Murder Case: "భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి చిన్న చేపలు - తాడేపల్లి ప్యాలెస్ లో పెద్ద చేపలు"
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా రెడ్డి హత్య కేసులో అరెస్టయిన భాస్కర్ రెడ్డి చిన్న చేప మాత్రమే అని.. పెద్ద చేపలన్నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాయంటూ బీటెక్ రవి ఫైర్ అయ్యారు.
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చిన్న చేపలు అంటూ టీడీపీ నేత, పులివెందుల ఇంఛార్జీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద చేపలన్నీ తాడేపల్లి ప్యాలెస్ ఉన్నాయని చెప్పారు. వేంపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కామెంట్లు చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడంతో కొంత న్యాయం జరిగిందంటూ తెలిపారు. ప్రధానంగా వివేకా కుమార్తె సునీత పోరాటానికి న్యాయం జరిగినట్లు తాను భావిస్తున్నానని వెల్లడించారు. అలాగే తాడేపల్లి ప్యాలెస్ లోని పెద్ద చేపలపై సీబీఐ దృష్టి పెడితే నిజమైన న్యాయం కచ్చితంగా జరుగుతుందన్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి ఘటనతో టీడీపీ నేతలు ఎవరూ సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయద్దని సూచించారు. అలాగే పులివెందులలో టీడీపీ జెండా ఎగిరే రోజులు దగ్గరపడ్డాయని బీటెక్ రవి చెప్పుకొచ్చారు.
నాడు అనవసరంగా చంద్రబాబుపై ఆరోపణలు
మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుల హస్తం ఉందని పట్టభద్రుల శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసులో కీలక వ్యక్తులుగా ఉన్న వారిని సీబీఐ అరెస్ట్ చేసిందని ఆయన వెల్లడించారు. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుపై అనవసర ఆరోపణలు చేశారన్నారు. ఇప్పుడిప్పుడే నిందితుల వివరాలు బయటకు వస్తున్నాయని.. అన్నారు. అలాగే కోడికత్తి కేసు కూడా ఓ బూటకమని ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు.
మరోవైపు వివేక హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏప్రిల్ 30కు డెడ్ లైన్ విధించడంతో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం బయటకు వస్తుందని టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇప్పటికే సీబీఐ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. రేపో, మాపో ఆయన కుమారుడు అవినాష్ రెడ్డి కూడా అరెస్టయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ కేసు సెగ తాడేపల్లి ప్యాలెస్ కు తాకుతుందన్నారు. త్వరలోనే సీఎం జగన్ కుట్రలు, కుతంత్రాలు బయటకు వస్తాయని పత్తిపాటి పుల్లారావు అన్నారు.
భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన సీబీఐ
వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించ నున్నారు. ఈ నెల 29 వరకు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించింది. ఆర్యోగ కారణాల దృష్ట్యా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాదులు సీబీఐ న్యాయ మూర్తిని కోరారు. అయితే ఈ విషయాన్ని పరిశీలిస్తామని న్యాయమూర్తి అన్నారు. అయితే సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డి కస్టడీ కోరుతూ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. దీనిపై రేపు నిర్ణయిస్తామని కోర్టు తెలిపింది. దీంతో భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు.