(Source: ECI/ABP News/ABP Majha)
Visakha Railway Zone: విశాఖ రైల్వే జోన్ నిలిచిపోవడానికి కారణం చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Visakha Railway Zone | విశాఖకు రైల్వే జోన్ తమ తొలి ప్రాధాన్యత అంశమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం వల్లే రైల్వే జోన్ ఆలస్యమైందని చెప్పారు.
Union Minister Ram Mohan Naidu | అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అంశం విశాఖ రైల్వేజోన్ (Visakha Railway Zone) అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిధులు కేటాయించిందని వెల్లడించారు. రైల్వే జోన్ కు సంబంధించి కేంద్రం గత రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడిగినట్లు పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అడిగిన 52 ఎకరాలను సేకరించడంలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆ కారణంగానే విశాఖ రైల్వేజోన్ అంశం కొన్నేళ్లుగా ముందుకు కదల్లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఏపీలోనూ ఎన్డీయే భాగస్వామి అయిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున గతంలో విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి కేంద్రం అడిగిన భూమిని సేకరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.
ఫిబ్రవరిలో అశ్వినీ వైష్ణవ్ ఏం చెప్పారంటే..
విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకుగానూ 53 ఎకరాల భూమిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని అడిగినట్లు అప్పటి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఈ ఏడాది ఫిబ్రవరిలో చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధమైందని, కానీ వైసీపీ ప్రభుత్వం భూమి ఇస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రాకముందు 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి రూ.886 కోట్ల నిధులు ఇచ్చారని చెప్పారు. కానీ ఫిబ్రవరి బడ్జెట్లో ఒక్క ఏపీ రాష్ట్రానికి రూ.9,138 కోట్లు కేటాయించామని తెలిపారు. ఏపీలో ఏడాదికి 240 కిలోమీటర్ల మేర నూతన ట్రాక్ పనులు జరుగుతున్నాయని వివరించారు. విభజన చట్టం ప్రకారం రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని, తమ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యలు జరికాదని ఆ సమయంలో వైసీపీ నేతలు హితవు పలికారు.
విశాఖ రైల్వే జోన్ పై గతంలో కేంద్ర ప్రభుత్వం ఒకలా చెబితే, గత వైసీపీ ప్రభుత్వం మరోలా మాట్లాడేది. కానీ ప్రస్తుతం ఏపీలో , కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వాలు అధికారంలో ఉండటం కలిసొచ్చే అంశం. ఏపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన 53 ఎకరాల భూమి ఇవ్వకపోవడంతో రైల్వే జోన్ ఏర్పాటు జాప్యం జరిగిందని అప్పటి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. జనవరి 2న జీవీఎంసీ కమిషనర్ (GVMC Commissioner) 52.22 ఎకరాలను ఇస్తూ రైల్వేశాఖకు ఇచ్చిన లేఖను అప్పటి వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది. వాల్తేర్ డివిజన్‌పై అస్పష్టత నెలకొందని, ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వేల మధ్య ఆస్తుల వివాదం ఉందని.. సమస్యల్ని పరిష్కారం చేయకుండా తమపై నిందలు వేస్తున్నారని అప్పటి వైసీపీ ప్రభుత్వం స్పందించింది.
విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమలులో జాప్యానికి గత వైసీపీ ప్రభుత్వం కారణమని అటు ఏపీ ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించాయి. రైల్వే జోన్ ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధంగా ఉంది, కనుక రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇస్తే.. కేంద్రం పనులు త్వరగా ప్రారంభించనుంది. రైల్వే జోన్ డీపీఆర్ 2019 సెప్టెంబర్‌లో రైల్వే బోర్డుకు అందజేయగా, ఆమోదం కూడా పొందింది. కానీ రాష్ట్రం భూములు ఇవ్వలేదని కేంద్రం చెబితే.. ఆ భూములు వివాదంలో ఉన్నాయని గత వైసీపీ ప్రభుత్వం పరస్పరం ఆరోపించుకున్నాయి. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం రైల్వే జోన్ ఏర్పాటును వేగవంతం చేయనుందని అంతా భావిస్తున్నారు.
Also Read: Atchannaidu: కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, త్వరలో కొత్త చట్టం: మంత్రి అచ్చెన్నాయుడు