Qatar Death Penalty: ఉపాధి కోసం వెళ్తే ఉరిశిక్ష వేశారంటున్న నేవీ మాజీ అధికారి కుటుంబం- మోదీ జోక్యం చేసుకోవాలని రిక్వస్ట్
సుగుణాకర్‌తోపాటు 8 మంది గూఢచర్యానికి పాల్పడ్డారని చెప్పడం దుష్ప్రచారమని ఆరోపించారు కల్యాణ్ చక్రవర్తి. ఉపాధి కోసం వెళ్లిన వారిని తప్పుడు కేసుల్లో ఇరికించి మరణ శిక్ష విధించడం అన్యాయం అన్నారు.
ప్రధానమంత్రి మోదీ తలచుకుంటే ఖతార్‌లో శిక్ష పడిన సుగుణాకర్ విడుదల కావడం అంత కష్టమేమీ కాదన్నారు ఆయన బావమరిది కల్యాణ్ చక్రవర్తి. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ నేవీ అధికారి సుగుణాకర్ బావమరిది ఖతార్ చర్యలను తప్పుపట్టారు. 2013లో రిటైర్ అయిన సుగుణాకర్ ఉపాధి కోసం 2018లో ఖతార్ వెళ్లారని పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలతో ఆయన్ని గూఢచర్యం కేసులో అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సుగుణాకర్‌తోపాటు 8 మంది గూఢచర్యానికి పాల్పడ్డారని చెప్పడం దుష్ప్రచారమని ఆరోపించారు కల్యాణ్ చక్రవర్తి. ఉపాధి కోసం వెళ్లిన వారిని తప్పుడు కేసుల్లో ఇరికించి మరణ శిక్ష విధించడం అన్యాయం అన్నారు. 14 నెలల కిందట అరెస్ట్ చేసినా భారత్ రాయబార కార్యాలయానికి సమాచారం ఇవ్వలేదన్నారు. 80 రోజుల తర్వాత వారికి సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోదీ తలచుకుంటే సుగుణాకర్ విడుదల అవుతారని అభిప్రాయరపడ్డారు కల్యాణ్ చక్రవర్తి. ఈ అంశంలో మోదీ జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. ఆయన కుటుంబం చాలా ఆవేదనలో ఉందని ప్రభుత్వమే భరోసా ఇవ్వాలని వేడుకున్నారు.
2022 ఆగస్టులో 8 మంది ఇండియన్ నేవీ మాజీ అధికారులు ఖతార్‌లో అరెస్ట్ అయ్యారు. వీరిలో కమాండర్ పూర్ణేందు తివారి, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ సంజీవ్ గుప్తా, కేప్టెన్ నవ్‌తేజ్ సింగ్ గిల్, కేప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కేప్టెన్ సౌరభ్ వశిష్ఠ్, సెయిలర్ రాగేశ్ గోప కుమార్ ఉన్నారు. వీళ్లందరికీ నేవీలో 20 ఏళ్ల సర్వీస్ ఉంది. 2019లో కమాండర్ పూర్ణేందు తివారికి ప్రావసి భారతీయ సమ్మాన్ అవార్డు కూడా వచ్చింది. అసలు వీళ్లంతా ఖతార్‌కి ఎందుకు వెళ్లారన్నదే కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఖతార్‌లోని ప్రైవేట్ కంపెనీ అయిన Dahra Global Technologiesలో వీళ్లు పని చేశారు. ఈ కంపెనీకి రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్ ( Royal Oman Air Force) కి చెందిన రిటైర్డ్ స్వాడ్రన్ లీజర్ ఖమీస్ అల్ అజ్మీ (Khamis al-Ajmi) ఓనర్. గతేడాది ఖమీస్‌ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరవాత వెంటనే విడుదల చేశారు. మిగతా 8 మంది మాత్రం జైల్లోనే ఉండిపోయారు. చాలా సెన్సిటివ్ ప్రాజెక్ట్‌పై వీళ్లంతా పని చేస్తున్నారు. వీళ్లు ఖతార్‌కి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఖతార్‌కి చెందిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ఇజ్రాయేల్‌కి చేరవేస్తున్నారని ప్రభుత్వం మండి పడింది. గూఢచర్యం ఆరోపణలతో జైలుశిక్ష విధించింది. ఏడాదిగా జైల్లో ఉంటున్న ఈ 8 మంది అధికారులు బెయిల్ కోసం చాలా సార్లు అప్లై చేసుకున్నారు. కానీ అందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. పైగా ఇప్పుడు ఏకంగా ఉరిశిక్ష విధించింది.
భారత్ స్పందన ఇదే..
ఈ తీర్పుతో షాక్‌కి గురైంది భారత్. విదేశాంగ శాఖ వెంటనే అప్రమత్తమైంది. పూర్తి తీర్పు ఇంకా రాలేదని, అది చదివిన తరవాతే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. లీగల్ పరంగా ఉన్న అన్ని దారులనూ వెతుకుతున్నట్టు వెల్లడించింది. వీలైనంత వేగంగా అక్కడి అధికారులతో మాట్లాడి సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. వాళ్ల కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.