AP News: వార్డెన్ తాగి కొడుతుంది, వార్డెన్ భర్త అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు- ధైర్యంగా బాలికల ఫిర్యాదు
Andhra Pradesh News | హాస్టల్ వార్డెన్ తాగి తమను కొడుతోందని, ఆమె భర్త తమతో అసభ్యకరంగా ప్రవర్తించాలని చూస్తున్నాడని బీసీ హాస్టల్ విద్యార్థినులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
Girl Students complaints against Hostel Warden in Kothavalasa in Vizianagaram district | కొత్తవలస: రాష్ట్ర ప్రభుత్వం బాలికలు, మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని చెబుతున్నా ఏదో చోట వారికి సమస్యలు ఎదురవుతున్నాయి. కొందరికి బయటకు వెళితే ఇబ్బందులు ఎదురైతే, మరికొందరు విద్యార్థినులకు వారు ఉంటున్న హాస్టల్ లో సమస్యలు ఉన్నాయని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో జరిగింది.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు
విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక బీసీ హాస్టల్ బాలికలు కొత్తవలస పోలీస్ స్టేషన్లో వార్డెన్ నీరజాకుమారిపై ఫిర్యాదు చేశారు. బాలికలు మాట్లాడుతూ.. హాస్టల్ వార్డెన్ రోజూ తమను కొడుతుందని తెలిపారు. అసభ్యకరంగా మాట్లాడుతుందని, హాస్టల్ వార్డెన్ భర్త తమపై అసభ్యకరంగా ప్రవర్తించాలని చూస్తున్నారని సంచలన విషయాలు వెల్లడించారు. హాస్టల్లో ఆహారం కూడా సరిగ్గా పెట్టడం లేదని, హాస్టల్‌కు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులు కూడా అమ్ముకుంటారని విద్యార్థినులు తెలిపారు.
అధికారులకు సైతం విద్యార్థినుల ఫిర్యాదు
ఇదే విషయంపై స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ షర్మికరావుకు, తహసీల్దార్ కార్యాలయంలో సీఎస్డీటి రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. అధికారులు బాలికలు ఫిర్యాదుపై స్పందించి పై అధికారులకు తెలియజేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అన్నారు. బీసీ హాస్టల్ ఆడపిల్లలకు కొత్తవలస పోలీస్ స్టేషన్ కి ఆనుకుని ఉన్న హాస్టల్‌లో తమకు వసతి కల్పించాలని బాలికలు కోరారు. పోలీస్ స్టేషన్ పక్కన ఉంటే తమకు ఎక్కువ రక్షణ ఉంటుందని బాలికలు భావిస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read: Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్