AP IPS Transfers : విశాఖ సీపీ బదిలీ - కడప ఎస్పీ కూడా - ఏపీ కీలో కీలక అధికారులకు స్థానచలనం !
విశాఖ కమిషనర్ త్రివిక్రమ వర్మపై బదిలీ వేటు పడింది. పలువురు ఐపీఎస్ ఆఫీసర్లను కూడా బదిలీ చేశారు.
AP IPS Transfers : విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మపై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో రవిశంకర్ అయ్యన్నార్ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. త్రివిక్రమ్ వర్మను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీగా నియమించారు. రవిశంకర్ అయ్యన్నార్ ఇప్పటి వరకూ నిర్వహించిన విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ ఏడీజీగా కుమార్ విశ్వజిత్‌గా పోస్టింగ్ ఇచ్చారు. అక్టోపర్ ఎస్పీగా ఉన్న సిద్ధార్త కౌశల్ ను కడప ఎస్పీగా నియమించారు. చాలా కాలం నుంచి కడప ఎస్పీగా ఉన్న అన్బురాజన్ ను అనంతపురం ఎస్పీగా బదిలీ చేశారు. అనంతపురం ఎస్పీగా ఉన్న కె.శ్రీనివాస్ ను విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ డీసీపీగా నియమించారు. ఆ బాద్యతల్లో ఉన్న విద్యాసాగర్ నాయుడును గ్రే హౌండ్స్ ఎస్పీగా నియమించారు. ఎసీబీ ఎస్పీగా ఉన్న బొడ్డేపల్లి కృష్ణారావును అన్నమయ్య జిల్లా ఎస్పీగా నియమించారు. ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఉన్న గంగాధరరావును అనంతపురం 14వ బెటాలియన్ కమాండెంట్ గా నియమించారు. ఆ స్థానంలో ఉన్న జగదీష్ ను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు.
మొత్తంపదకొండు మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. వీరంతా కీలక స్థానాల్లో ఉన్న వారే. అయితే ఎవరికీ ప్రాధాన్యం తగ్గించలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. కానీ విశాఖ సీపీగా త్రివిక్రమ్ వర్మను తప్పించడం మాత్రం చర్చనీయాంశమవుతోంది. ఆయనను గత ఏప్రిల్ లోనే విశాఖ సీపీగా నియమించారు. ఆరు నెలల వ్యవధిలోనే ఆయనను బదిలీ చేయడం చర్చనీయాంశం అవుతోంది. బదిలీకి ప్రధాన కారణం.. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో జరిగిన కిడ్నాప్ వ్యవహారంగా భావిస్తున్నారు. ఈ అంశం విషయంలో ప్రభుత్వ పెద్దల్ని ఆయన సంతృప్తి పరచలేకపోయారని.. అప్పుడే అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. అయితే.. ప్రభుత్వం ఇలాంటి అభిప్రాయాలు వినిపించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది.
విశాఖ పోలీస్ కమిషనరేట్ న ుఅప్ గ్రేడ్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ వర్మ ఐజీ క్యాడర్ లో ఉన్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ గా ఐజీ స్థాయి అధికారులు ఉంటారు. కానీ ఈ సారి మాత్రం ఏడీజీ హోదాలో ఉన్న రవిశంకర్ అయ్యన్నార్ ను నియమించారు. అంటే.. పోలీస్ కమిషనరేట్ ను అప్ గ్రేడ్ చేసినట్లుగా భావిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అదే సమయంలో.. విశాఖలో వివిధ రకాల నేరాలు పెరుగుతున్న సమయంలో.. కమిషనరేట్ ను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
కొంత మంది ఎస్పీలు సుదీర్గ కాలంగా పని చేస్తున్నందున బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. కడప ఎస్పీ అన్బురాజన్ మూడేళ్లకుపైగా కడపలోనే విధులు నిర్వహిస్తున్నారు. అందుకే ఆయనను అనంతపురంకు బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది.