వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్‌కు నో బెయిల్- దర్యాప్తు కీలక దశలో ఉందన్న సీబీఐ
వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ దశలో నిందితులకు బెయిల్ ఇస్తే విచారణపై ప్రభావం పడుతుందని వాదించింది.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్‌కు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. సాక్షుల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోర్టు చెప్పింది. వివేక హత్య కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని అందుకే సునీల్‌కు బెయిల్ ఇస్తే మళ్లీ దర్యాప్తునకు ఆటంకం ఏర్పడుతుందన్న సీబీఐ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం సాక్షిగా పిలిచినప్పటికీ నిందితుడిగా చేర్చవచ్చని చెప్పింది న్యాయస్థానం.
బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ తరఫున న్యాయవాది, సునీల్ యాదవ్ తరఫున లాయర్, వివేక సతీమణి సౌభాగ్యమ్మ తరఫున లాయర్లు సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఈ హత్య కేసులో సునీల్‌ది చాలా కీలక పాత్ర అని ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారని.. ఇప్పటికే అలాంటి ప్రయత్నం జరిగిందని కోర్టుకు చెప్పింది సీబీఐ. సునీల్`ఎప్పుడూ దర్యాప్తునకు సహకరించలేదన్నారు. ఆయన గోవాకు పారిపోతే గూగుల్ ట్రాకింగ్ ద్వారా పట్టుకొని అరెస్టు చేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా సునీల్ పాత్ర వివరించారని తెలిపారు.
దీంతోపాటు ఈ కేసులో సునీల్ పాత్రను నిర్దారిస్తూ చాలా కీలకమైన ఆధారాలు ఉన్నాయని ఇప్పుడు వాటిని వెల్లడించలేమని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న కల్లూరు గంగాధర్‌రెడ్డి గత జూన్‌లో అనుమాస్పద స్థితిలో మృతి చెందాడని... ఇవన్నీ చూస్తుంటే సాక్షులను ఎంతలా ప్రభావిస్తం చేస్తున్నారో అర్థమవుతుందని కోర్టుకు వివరించింది. అందుకే బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు తెలిపారు.
వివేకా హత్య ఘటనకు ముందు సునీల్ యాదవ్ ఓ శక్తిమంతమైన నేతల ఇంట్లో ఉన్నారని వివేకా సతీమణి సౌభాగ్యమన్న తరఫున లాయర్ వాదించారు. వివేక హత్యకు ప్లానింగ్, అమలు, అనంతర పరిణామాల్లో సునీల్ పాత్ర ఉందని ఆయన సాక్షులను బెదిస్తున్నారని... ఈ కేసులో పలుకుబడి ఉన్న నేతలు ఉన్నప్పటకీ ఇప్పుడు కోర్టుకు వెల్లడించలేమన్నారు.
వివేకా హత్య రాజకీయ కారణాలతో జరలేదన్నారు సునీల్ తరఫున వాదించిన న్యాయవాది. ఓ ముస్లిం యువతి వల్ల జరిగిందన్నారు. అది లవ్ జిహాద్ అని కోర్టుకు తెలిపారు. ఆయన హత్య అనంతరం చాలా కాగితాలు దొరికినట్టు అల్లుడు రాజశేఖర్ రెడ్డి చెప్పారన్నారు. సునీల్‌కు బెయిల్ ఇచ్చినప్పటికీ తెలంగాణ విడిచిపెట్టి వెళ్లబోరని... అందుకే షరతులతో కూడిన బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అందరి వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు సునీల్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. సునీల్ యాదవన్‌ను సాక్షిగా పిలిచినప్పటికీ నిందితుడిగా చేర్చవచ్చని పేర్కొన్న హైకోర్టు... గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ తీర్పును ప్రస్తావించింది. ఈ కేసులో ట్రాన్స్‌పరెంట్‌గా విచారణ జరగాల్సి ఉన్నందున ఈ దశలో బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
ఈ మధ్యే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సీబీఐ కీలక అంశాలను బయటపెట్టింది. వైఎస్ వివేకానంద రెడ్డిని అవినాశ్ రెడ్డే చంపించారని, అందుకు సాక్ష్యాలన్నీ ఉన్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తేల్చి చెప్పింది. వివేకానంద రెడ్డి హత్య విషయంలో నేరుగా పాల్గొన్న సునీల్ యాదవ్ (A2) బెయిల్ పిటిషన్ కు కౌంటర్ గా తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ లో ఎన్నో సంచలన విషయాలను దర్యాప్తు సంస్థ బహిర్గతం చేసింది. తమ విచారణలో భాగంగా తేలిన విషయాలను సీబీఐ ఆ పిటిషన్‌లో వివరించింది. హత్యకు సంబంధించి రూ.40 కోట్లతో ఒప్పందం కుదరడంలో సునీల్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడని తెలిపింది.
సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. వివేకానందరెడ్డిని అవినాశ్ రెడ్డి అడ్డు తొలగించుకోవాలని అనుకోవడానికి, తన ఎంపీ సీటుకు అడ్డు రావడమే కారణమని సీబీఐ పేర్కొంది! వైఎస్ వివేకాను చంపేందుకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి (A5)తో కలిసి అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్ర పన్నారని వివరించింది. ఆ ప్లానును దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అమలు చేశారని తేలిందని వెల్లడించారు. ఆ సమయంలో వివేకానందరెడ్డితో విభేదిస్తున్నవారిని ఏకతాటిపైకి తెచ్చారని వివరించింది.