Prakasam Barrage Flood Today: ప్రకాశం బ్యారేజీకీ భారీగా చేరుతున్న వరద నీరు -లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక
Prakasam Barrage Flood Today: ప్రకాశం బ్యారేజీకీ భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Prakasam Barrage Flood Today: కృష్ణానదికి వరద ప్రవాహం భారీ గా చేరుతున్నందున ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో లోతట్టు ప్రాంత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం 3 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందన్నారు.
బుధవారం రాత్రి సమయానికి వివిధ ప్రాజెక్టులలోని వరద ప్రవాహం క్యూసెక్కుల్లో ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
సుంకేశుల వద్ద ఇన్ ఫ్లో 1.06లక్షల క్యూసెక్కులుగా ఉంటే ఔట్ ఫ్లో 1.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 2.79 లక్షల క్యూసెక్కులు అయితే ఔట్ ఫ్లో 3.17 లక్షల క్యూసెక్కులుగా రికార్డు అయినట్టు అధికారులు చెబుతున్నారు.
నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 2.82 లక్షల క్యూసెక్కులుగా ఉంటే ఔట్ ఫ్లో 3.10 లక్షల క్యూసెక్కులుగా పేర్కొన్నారు.
పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 3.01 లక్షల క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 3.25లక్షల క్యూసెక్కులుగా రిజిస్టర్ అవుతోంది.
ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 94,679 క్యూసెక్కులు ఉందన్నారు.
ఎప్పటికప్పుడు కృష్ణా వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణా నది మీద ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ కోరారు. బోట్లు, మోటర్ బోట్లు, పంట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయకూడదన్నారు. పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. గోదావరి,కృష్ణా నదుల వరద హెచ్చుతగ్గుల దృష్ట్యా పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.





















