Devineni Uma Arrest: దేవినేని ఉమాకు 14 రోజుల రిమాండ్.. రాజమహేంద్రవరం జైలుకు తరలింపు
మాజీ మంత్రి దేవినేని ఉమాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను రాజమహేంద్రవరం జైలుకు తీసుకెళ్లనున్నారు.
టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర్‌రావును అర్ధరాత్రి దాటాక పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఇతర నేతలతో కలిసి జి.కొండూరు పోలీస్‌స్టేషన్ ఎదుట దేవినేని ఆందోళనకు దిగారు. సుమారు ఆరుగంటల పాటు తన కారులో కూర్చొని నిరసన తెలిపారు. అర్ధరాత్రి తర్వాత వాహనం అద్దాలు తొలగించి దేవినేనిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం తమ వాహనంలో ఎక్కించుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు.
దేవినేనిని పోలీసులు ఆన్‌లైన్‌లో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి జూమ్ యాప్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. పోలీసులు దేవినేని ఉమాను రాజమహేంద్రవరం జైలుకు తరలించనున్నారు.
అసలేం జరిగిందంటే..
కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణల నేపథ్యంలో నిజనిర్ధరణకు మాజీ మంత్రి దేవినేని వెళ్లారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. అటవీ సంపద కొల్లగొడుతున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. పరిశీలన ముగించుకుని.. తిరిగి వస్తుండగా.. గడ్డమణుగ గ్రామం దగ్గర ఉమా వాహనంపై అకస్మాత్తుగా వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. రాళ్లతో దాడి చేశారు. దేవినేని కారుతోపాటు పలు వాహనాలు ఈ ఘర్షణలో ధ్వంసమయ్యాయి. ఈ కారణంగా ఒక్కసారిగా టీడీపీ, వైసీపీ నేతల నడుమ వివాదం నెలకొంది. ఇరు వర్గాల వారు.. దాడి చేసుకునే స్థాయికి గొడవ వెళ్లింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.
ఈ వివాదంలో పలువురికి గాయాలయ్యాయి. దాడికి దిగిన వారిని అరెస్టు చేయలేదని.. దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయలయ్యేలా ప్రవర్తించిన వ్యక్తులను అరెస్టు చేయాలని జి.కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద... వాహనంలోనే ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో కారు అద్దం పగలగొట్టి మరీ... దేవినేనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమాకు మద్దతుగా వస్తున్న టీడీపీ నేతలను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. పలువురు ముఖ్యనేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అయినా స్టేషన్ వద్దకు టీడీపీ, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు మరోసారి లాఠీ ఛార్జి చేశారు.
సుమారు ఆరు గంటలపాటు కారులోనే దేవినేని నిరసన తెలిపారు. కారు అద్దం ధ్వంసం చేసి.. మరీ.. పోలీసులు ఉమాను అరెస్టు చేశారు. దేవినేని ఉమాపై అట్రాసిటీ, 307 సెక్షన్ల కింద జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దేవినేని ఉమాతో పాటు మొత్తం 18మంది టీడీపీ వర్గీయులపై కేసులు నమోదు అయ్యాయి. అనంతరం పెద్దపారుపూడికి తరలించారు. సీఎం జగన్, సజ్జల రామకృష్ణా రెడ్డి అండతోనే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ దాడి చేయించారని దేవినేని ఆరోపించారు. ఈ నెల 20వ తేదీన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడిన వీడియోను టీడీపీ నేతలు విడుదల చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణతో దేవినేని ఉమాను అరెస్టు చేశామని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు.
దేవినేని ఉమా అరెస్టుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఉమాపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని..తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలను వదిలిపెట్టారని.. తెలుగుదేశం పార్టీ నేతలపై హత్యాయత్నం కేసు పెట్టడం ఏంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను హౌస్ అరెస్టు చేశారు. దేవినేని ఉమా అరెస్టుకు నిరసనగా జిల్లాలో ఆందోళనలకు తెదేపా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు.. పార్టీ నేతలను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.
Also Read: Basavaraj Bommai Bio: కర్ణాటక కొత్త సీఎం బసవరాజ బొమ్మై గురించి ఈ విషయాలు తెలుసా?