CPI Narayana: దొంగలను దొరలుగా మార్చేందుకే 2000 నోట్ల రద్దు! మోదీనే అసలైన ఆర్థిక నేరస్థుడు: సీపీఐ నారాయణ
CPI Narayana: దేశ ప్రధాని మోదీకి అభివృద్ధిపై ఏమాత్రం ధ్యాస లేదని.. కేవలం అవినీతిపై మాత్రమే ఆయన పోకస్ చేస్తారంటూ సీపీఐ నారాయణ ఫైర్ అయ్యారు. ఆయనే అసలైన ఆర్థిక నేరస్థుడని ఆరోపించారు.
CPI Narayana: దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అభివృద్ధిపై ఏమాత్రం ధ్యాస లేదని, ఆయనకు కేవలం అవినీతిపై మాత్రమే ఫోకస్ ఉందని... అసలైన ఆర్థిక నేరస్థుడు ఆయనే అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. బీజేపీ అవినీతి పాలనను చూడలేక, భరించలేకే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు అధికారం అప్పగించారని అన్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించిందని గుర్తు చేశారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు. కర్ణాటక తరహా గెలుపు ఇతర రాష్ట్రాల్లో కూడా మొదలవుతుందని చెప్పుకొచ్చారు. ఈ ఫలితం ప్రభావం దేశంలోని అన్ని రాష్ట్రాలను ఆలోచించేలా చేస్తుందని సీపీఐ నారాయణ అన్నారు. దేశ ఐక్యత కోసం ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీలో పని చేశారని గుర్తు చేశారు. ఆ కుటుంబంపై ప్రస్తుతం మోదీ కక్ష సాధిస్తున్నారని తెలిపారు.
దొంగలను దొరలుగా మార్చేందుకే రెండు వేల నోట్లు రద్దు..!
రెండు వేల రూపాయల నోట్లు ఉపసంహరణ వెనుక కచ్చితంగా ఏదో దురుద్దేశం ఉందని నారాయణ తెలిపారు. రెండు వేల నోట్ల రూపాయలను ఉపసంహరించి దొంగలను దొరలుగా చేశారన్నారు. నోట్లు మార్చుకునేందుకు ఎందుకు నాలుగు నెలల సమయం ఇచ్చారని బీజేపీని ప్రశ్నించారు. బీరువాల్లో దాచుకున్న డబ్బునంతా తీసుకెళ్లి దర్జాగా పర్సంటేజ్ కి మార్చుకుంటారని దుయ్యబట్టారు. అలా వచ్చిన డబ్బుని బీజేపీ ఎన్నికల్లో ఖర్చు చేయబోతుందని నారాయణ జోస్యం చెప్పారు. దేశంలో పొలిటికల్ పొలరైజేషన్ వచ్చిందని అన్నారు. మోదీని గద్దె దించడానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకం అవుతాయని చెప్పారు. అలాగే ఏపీకీ జగన్ కన్నా మోదీయే ఎక్కున ద్రోహం చేశాడని అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నాయని.. ఏ కూటమి వచ్చినా రాష్ట్రంలో లాభం ఉండదన్నారు. బీజేపీ వ్యతిరేక ఓటు వైసీపీకీ పడుతుందన్నారు. అప్పుడు మళ్లీ జగన్ యే గెలిసే అవకాశం ఉందని చెప్పారు.
సీఎం జగన్ కేంద్రానికి బానిసగా మారాడనీ.. అదానీకి అనుకూలంగా ఉండకపోతే ఆయన్ని జైల్లో పెడతారని ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నారాయణ. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అదానీలకు ఏమాత్రం మద్దతు పలకకపోతే BJP నుంచి జగన్ ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ నేను తీసుకుంటాను అని ఒక్కమాట చెప్పగలరా అని నారాయణ ప్రశ్నించారు. అలా చెప్పిన మరుసటి రోజే జగన్ జైల్లో ఉంటాడని అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డింగ్‌కి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు నారాయణ. స్టీల్ ప్లాంట్ కొంటే నష్టం ఉండదన్న ఆయన.. ప్లాంటుకి 30 వేల ఎకరాల ల్యాండ్ ఉందని.. రూ.3 లక్షల కోట్లకు విలువైన ఆస్తి స్టీల్ ప్లాంట్ సొంతమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గౌతమ్ అదానీ ఎందుకు వస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. అదానీ రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంటును స్వాధీనం చేసుకుంటారు కానీ, నడిపించరు.. నష్టాలు చూపించి స్క్రాప్ లెక్కన అమ్మేస్తారని సంచలన ఆరోపణ చేశారు. 30,000 ఎకరాల స్థలాన్ని ఒక గ్రౌండ్ మాదిరిగా చేసి డంపింగ్‌కి వాడతారని చెప్పుకొచ్చారు. ఇతర దేశాలనుంచి వివిధ సరుకులను దిగుమతి చేసుకుని, ఆ స్థలాన్ని డంపింగుకి ఉపయోగిస్తారని అన్నారు నారాయణ.