Butterfly Park: మూలపాడులో బటర్‌ఫ్లై పార్కు కనువిందు - మరింత అభివృద్ధిపై ఫోకస్
ఈ పార్కును మరింత విస్తరిస్తే సందర్శకుల తాకిడి కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ శివారులోని మూలపాడులో ఉన్న సీతాకోకచిలుకల పార్కు అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ఈ సీతాకోకచిలుకల పార్కు ఇప్పటికే సందర్శకుల అభిమానాన్ని చూరగొంటోంది. అలాంటి ఈ అందాల పార్కును మరింతగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ పార్కును మరింత విస్తరిస్తే సందర్శకుల తాకిడి కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అభివృద్ధి జరిగి సందర్శకుల తాకిడి కనుక పెరిగితే ఇది ఆంధ్రప్రదేశ్ కే తలమానికంగా నిలుస్తుందని అధికారులు అంటున్నారు.
ప్రధాన అటవీ సంరక్షణ అధికారి మధుసూదన్ రెడ్డి కృషితో పాటు నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్), ఇంకా ఇతర స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పార్కుకు సంబంధించిన పనులు కనుక పూర్తి అయితే, నిత్యం ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మూలపాడు అటవీ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ అటవీ ప్రాంతంలో వృక్ష సంపద, జంతువులు, ఔషధ మొక్కలు, సెలయేర్లతో పాటు ప్రకృతి ప్రసాదించిన 68 రకాల సీతాకోక చిలుకలు విహరిస్తుంటాయి.
ఈ పార్కు ప్రకృతి ప్రేమికులకు ఎంతగానో అలరిస్తోంది. ఇది గ్రహించిన అప్పటి క్రిష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం.. 2018లో అడవిలో పర్యటించారు. అలా సీతాకోక చిలుకల పార్క్‌ను 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ సీతాకోకచిలుకల పెరుగుదలకు అవసరమైన మకరందం ఉత్పత్తి చేసే మొక్కలను పెంచారు.