Pawan Kalyan: తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్, హైడ్రాపై పవన్ కల్యాణ్ ప్రశంసలు
Vijayawada: తెలంగాణలో రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న హైడ్రా లాంటి వ్యవస్థ మంచిదే అని పవన్ కొనియాడారు. వరద రావడం లేదనే ఉద్దేశంతో ఎంతో మంది పరివాహక ప్రాంతాలను ఆక్రమించి ఇళ్లు కట్టుకున్నారని చెప్పారు.
Pawan Kalyan on HYDRA: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency) చేస్తున్న కూల్చివేత పట్ల పవన్ కల్యాణ్ ప్రశంసించారు. హైడ్రా లాంటి వ్యవస్థ మంచిదే అని, రేవంత్ రెడ్డి చేస్తున్న పని మంచిదే అని కొనియాడారు. వరద రావడం లేదనే ఉద్దేశంతో తెలంగాణలోనే కాక ఏపీలో కూడా ఎంతో మంది పరివాహక ప్రాంతాలను ఆక్రమించి ఇళ్లు కట్టుకున్నారని చెప్పారు. ఇందుకు ఒకరు కారణం కాదని.. ఎంతో మంది వ్యక్తులు ఎన్నో ఏళ్లుగా ఇలా ఆక్రమణలకు పాల్పడడం వల్లే ప్రస్తుతం వరదలు వస్తున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు.
‘‘2014-19లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వచ్చిన హుదూద్ తుపాను వేళ ముఖ్యమంత్రి చాలా సమర్థంగా వ్యవహరించారు. ఆ సమయంలో కూడా నేను రూ.50 లక్షల విరాళం ఇచ్చాను. నిన్న కూడా విజయవాడ వరదల కోసం రూ.కోటి సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చాను. బుడమేరు వాగు చుట్టుపక్కల దాదాపు 90 శాతం ఆక్రమణలు ఉన్నాయి. ఆ స్థలాల్లో ఇళ్లు కూడా నిర్మించేవారు. ఆ ఇళ్లకు కనీసం డ్రైనేజీ సౌకర్యం సరిగ్గా లేదు. హైదరాబాద్ లో కూడా ఈ మధ్య హైడ్రా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో, బఫర్ జోన్ పరిధుల్లో నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చేస్తున్నారు.
20 - 30 ఏళ్లుగా ఏ వరద లేదు కదా అనే ఉద్దేశంతో చాలా మంది చెరువు పరివాహక ప్రాంతాలను ఆక్రమించేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో లే అవుట్లు చేయడం అనేది కొన్ని ఏళ్లుగా జరుగుతూనే ఉంది. ఇదేదో ఒకరి పని కాదు. కానీ, గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం తమ హాయాంలో ఎంతో కొంత చర్యలు తీసుకొని ఉండాల్సింది. ఇప్పుడు చంద్రబాబు ఆ వయసులో కూడా పొక్లెయిన్‌లు, పడవలు, బుల్డోజర్లు ఎక్కి చేరుకోలేని ప్రాంతాలకు సైతం చేరుకోవడం చాలా అభినందనీయం. అలాంటి వ్యక్తిని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఒక్కసారి ఆయన పనిని గుర్తించి వైసీపీ నేతలు మాట్లాడాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.