Kodikathi Case : 'రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం' కోడికత్తి కేసు అక్కడే ఆగింది - న్యాయవాది అబ్దుల్ సలీమ్
Kodikathi Case : రావాలి జగన్.. చెప్పాలి సాక్ష్యం.. అక్కడ ఈ కేసు ఆగిందని నిందితుడు శ్రీనివాస్ తరఫు న్యాయవాది అన్నారు.
Kodikathi Case : విజయవాడ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తిపై సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో సీఎం జగన్ తరఫు న్యాయవాది సుమారు నాలుగు గంటలపాటు వాదనలు వినిపించారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. విచారణ అనంతరం నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది అబ్దుల్ సలీమ్ మీడియాతో మాట్లాడారు. రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం.. అక్కడే ఈ కేసు ఆగిపోయిందని లాయర్ అబ్దుల్ సలీమ్ అన్నారు. దినేష్ కుమార్ వాంగ్మూలం ఇచ్చారని, ఇప్పుడు సీఎం జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలన్నారు. కానీ జగన్ కోర్టుకు రాకుండా పిటిషన్ వేసి గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. పోలీసులు కూడా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, నిందితుడిపై 307 సెక్షన్ పెట్టకూడదని, ఈ కేసు ఎన్ఐఏకు ఇవ్వడం కూడా వాదిస్తున్నారన్నారు.
జగన్ తరపు న్యాయవాది ఇనికొల్లు వెంకటేశ్వర్లు ఏమన్నారంటే?
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో తదుపరి దర్యాప్తు కోసం వేసిన పిటీషన్ పై వాదనాలు జరిగాయని న్యాయవాది ఇనికొల్లు వెంకటేశ్వర్లు తెలిపారు. 2019 జనవరి 1న ఎన్ఐఎ ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిందన్నారు. దీనిలో భాగంగా సాక్షులను విచారించిందన్నారు. ఎన్ఐఎ జగన్ ను విచారించిన సమయంలో చాలా విషయాలు ఎన్ఐఎ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. జగన్ తెలిపిన విషయాలపై ఎన్ఐఏ ఎటువంటి విచారణ జరపకుండా 2019 జనవరి 23న ఛార్జీషీట్ దాఖలు చేశారన్నారు. జగన్ వేసిన పిటీషన్ పై కుట్రకోణం లేదంటూ ఎన్ఐఎ కౌంటర్ దాఖలు చేసిందన్నారు. ఈ కేసును ఎన్ఐఏ సరిగా దర్యాప్తు చేయలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. నిందితుడు శ్రీనివాసరావుకు ఏఈపీ ఇచ్చే సమయంలో పూర్తి స్థాయి విచారణ చేసి ఇవ్వాలని కోరామన్నారు. కానీ ఎటువంటి విచారణ చేయాలని జగన్ తరఫు న్యాయవాది ఆరోపించారు.
సమగ్ర దర్యాప్తు చేయాల్సి ఉంది
"రెస్టారెంట్ ఓనర్ డీక్లరేషన్ ఇచ్చారు. నిందితుడి శ్రీనివాస్ కు అధికారులు సరైన నిబంధనలు పాటించకుండా ఎయిర్ పోర్ట్ ఎంట్రీ పాస్ ఇచ్చారు. వాటిపై ఎన్ఐఏ దర్యాప్తు చేయలేదు. దాడి జరిగిన సమయంలో నిందితుడు శ్రీనివాస్ దగ్గర ఏఈపీ పాస్ లేదు. తనకు ఏమైనా జరిగితే తన అవయవాలు దానం చేయాలంటూ తల్లిదండ్రులకు నిందితుడు శ్రీనివాస్ రాసిన లేఖపై దర్యాప్తు చేయలేదు. బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా నిందితుడి వివరాలు ఎన్ఐఏ సమర్పించింది. స్థానిక పోలీసులు విచారణలో మాత్రం బయోమెట్రిక్ లో శ్రీనివాస్ పేరు రిజిస్టర్ కాలేదని వెల్లడైంది. ఎన్ఐఏ మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది." - జగన్ తరఫు న్యాయవాది ఇనికొల్లు వెంకటేశ్వర్లు
ఈ నెల 20కి వాయిదా
విజయవాడ NIA కోర్టులో సోమవారం జగన్ పై హత్యాయత్నం కేసుపై విచారణ జరిగింది. నాలుగు గంటల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. సీఎం జగన్ తరఫు లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వరరావు వాదనలు పూర్తి చేశారు. నిందితుడు శ్రీనివాసరావు తరపు లాయర్, NIA వాదనలు ఈ నెల 20న వింటామని న్యాయమూర్తి తెలిపారు. కోడికత్తి కేసులో తదుపరి విచారణను ఈనెల 20కు వాయిదా వేసింది కోర్టు. కోడి కత్తి కేసులో లోతైన దర్యాప్తు కోరుతూ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఎన్ఐఏ కోర్టులో సోమవారం వాదనలు జరిగాయి. ఎన్‌ఐఏ, నిందితుడి శ్రీనివాసరావు తరపున న్యాయవాదులు వేసిన కౌంటర్లపై సీఎం జగన్ తరపు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.