Vande Bharat Metro: ఏపీలో వందే భారత్ మెట్రో రైలు - ఆ 2 నగరాల మధ్య పరుగులు!
Andhrapradesh News: త్వరలోనే వందే భారత్ మెట్రో రైళ్లను పట్టాలెక్కించనున్నట్లు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో ఏపీలో తిరుపతి - చెన్నై నగరాల మధ్య ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Vande Bharat Metro Train Runs In Ap: భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ రైళ్లు అందుబాటులో ఉన్న అన్ని రూట్లలోనూ పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వందే భారత్ రైళ్లకు భారీగా జనాదరణ పెరిగింది. ప్రస్తుతం సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండు రైళ్లు నడుస్తుండగా.. విజయవాడ - చెన్నై, విశాఖ - భువనేశ్వర్, సికింద్రాబాద్ - తిరుపతి, కాచిగూడ - యశ్వంత్ పూర్ మధ్య రైళ్లను నడుపుతున్నారు. ఈ రూట్లలోనూ వంద శాతం ఆక్యుపెన్సీతో దూసుకుపోతున్నాయి. తాజాగా వందే భారత్ స్లీపర్ రైళ్లను సైతం రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. ఇంట్రా సిటీ రవాణా వ్యవస్థలో భాగంగా మార్పు దిశగా తొలిసారిగా వందే భారత్ మెట్రో రైళ్లను (Vande Bharat Metro Trains) సైతం త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ జులై నుంచి వందే మెట్రో రైళ్లు పట్టాలెక్కనుండగా.. ఏపీలో కూడా ఒక రైలు అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఆ రూట్ లోనే.!
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి (Tirupati) నుంచి చెన్నై (Chennai) నగరాల మధ్య వందే భారత్ మెట్రో ట్రయల్ రన్ (Trail Run) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జులైలో ట్రయల్ రన్ చేపట్టనుండగా.. 2 వారాల ట్రయల్స్ అనంతరం ఈ నగరాల మధ్య పూర్తి స్థాయిలో రైలు నడపనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఆగ్రా - మధుర, లక్నో - కాన్పూర్ మార్గాలను సైతం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవలే వందే భారత్ మెట్రో లుక్ బయటకు రాగా.. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
First Basic until of Vande Metro from RCF Kapurtala is flagged for run trials on 30-04-2024.
— Ajay Singh (@railwaterman) May 1, 2024
The train has features similar to Vandebharat trains.
Adding a new dimension to train travel over IR.#IR#IndianRailways pic.twitter.com/m9yBE22Zf5
ఇవీ ప్రత్యేకతలు
- నగర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని వందే భారత్ మెట్రో రైళ్లను రూపొందిస్తున్నారు. ఈ రైళ్లు 100 నుంచి 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న నగరాల మధ్య రాకపోకలు సాగించనున్నాయి.
- ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, ప్రయాణికులను అనువైన సీటింగ్ ఉంటుంది.
- ఈ రైలులో నాలుగేసి బోగీలు ఓ యూనిట్ గా ఉండగా.. ఒక రైలులో కనీసం 12 బోగీలు ఉంటాయి. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా బోగీలను 16కు పెంచే ఛాన్స్ ఉంది.
- దేశవ్యాప్తంగా తొలి దశలో 50 మెట్రో రైళ్లు అందుబాటులోకి తీసుకు రానుండగా.. అనంతరం వీటిని 400 వరకూ పెంచాలని రైల్వే శాఖ భావిస్తోంది. వందే భారత్ రైళ్ల మాదిరిగానే ఈ సర్వీసులపైనా ప్రయాణికులు ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉంది.
Also Read: Election Commission: కూటమికి ఈసీ షాక్ - జనసేనకు గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేయలేమన్న ఎన్నికల సంఘం