Scrub Typhus: శ్రీకాకుళం జిల్లాలో 8 మందికి స్క్రబ్ టైపస్ వ్యాధి నిర్దారణ, ఇద్దరు మృతి!
Scrub Typhus: శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాలతో ఇప్పటికే ఇద్దరు చనిపోగా.. 8 మంది స్క్రబ్ టైపస్ వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం వారు రిమ్స్ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు.
Scrub Typhus: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని అప్పాపురం గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. గ్రామంలో స్క్రబ్ టైపస్ వ్యాధి ప్రబలడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఆ వ్యాధి సోకిన కారణంగా గ్రామంలో విషజ్వరాలు వంటి వాచి బారిన పడి ఒకే కుటుంబానికి చెందిన ఎండ సూరమ్మ, ఎండ భవానీలు మృతి చెందడంతో వారు భయపడుతున్నారు. మరి కొంత మంది కూడా ఆ వ్యాధి లక్షణాలతో సతమతమవుతున్నారు. వారిని చికిత్స కోసం రిమ్స్ లోని ప్రత్యేక వార్డుకి తరలించారు. అక్కడ వేరేగా వారిని వార్డులో ఉంచి వైద్య సేవలను అందిస్తున్నారు. గ్రామంలో ప్రతీ ఇంట్లో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచే చర్యలను చేపట్టారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని కప్పించేందుకు అవసరమైన కసరత్తులను చేస్తున్నారు.
గత వారం రోజులుగా గ్రామస్తులు ఈ వింత వ్యాధి కారణంగా భయపడుతున్నారు. విష జ్వరాలు గ్రామంలో ప్రబలుతున్న విషయం వెలుగులోకి రావడంతో జిల్లా అధికారులు తక్షణమే స్పందించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి బొడ్డేపల్లి మీనాక్షి గ్రామంలో ప్రత్యేక వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. లావేరు పీహెచ్ సీ వైద్యాధికారులు డా.చంద్రమౌళి, డా.జోత్స్నల ఆద్వర్యంలో ఫీవర్ సర్వే కొనసాగిస్తున్నారు. స్క్రబ్ టైపస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తు న్నారు. అందులో భాగంగా 7 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా శుక్రవారం మద్యాహ్నం నాటికి మరొక వ్యక్తిలో పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతోవారిని ప్రత్యేక చికిత్స కోసం రిమ్స్ కి తరలించారు. వారందరినీ అక్కడ ప్రత్యేక వార్డులో ఉంచి వైద్య సేవలను అందజేసున్నారు. ముందు జాగ్రత్త చర్యగా డాక్సి సైక్లిన్ మాత్రలను గ్రామస్థులకు పంపిణీ చేసి వాటిని వారు తీసుకునేలా చర్యలు చేపట్టారు.
స్క్రబ్ టైపస్ వ్యాధి ఎలా సోకుతుంది..?
స్క్రబ్ టైపస్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆ బ్యాక్టీరియా కరవడం వల్ల ఒంటిపై గాయాలు అయినట్లుగా కనిపిస్తోంది. జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పి వంటి లక్షణాలు దాని బారిన పడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వ్యవసాయ పనులు చేసే సమయంలో గ్రామస్థులు దాని బారిన పడి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ గ్రామాన్ని సందర్శించి స్థానికులతో మాట్లాడారు. వైద్య సిబ్బందికి మండల అధికారులకు కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారిల ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది, మండల స్థాయి, గ్రామ స్థాయి సిబ్బంది అక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలను తీసుకుంటున్నారు.
అప్పాపురం గ్రామం మొత్తం ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. బ్లీచింగ్ వేయించడం, స్ప్రేయింగ్ చేయించడం వంటి పనులు చేపట్టారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. వైద్యులు డా. చంద్రమౌలి, డా.జ్యోత్స్నలు అక్కడే ఉండి వైద్య సహాయాలను అందిస్తున్నారు. అదే విధంగా గ్రామస్థులకి అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నారు. వ్యవసాయ పనుల కోసం పొలాలకి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు ఒంటిపై ఎలాంటి పురుగులు లేకుండా చూసుకోవాలని, బట్టలు వేసుకునేముందు కూడా దులుపుకొని వేసుకోవాలని సూచించారు. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. దెబ్బ తగిలిన ట్లుగా ఒంటిపై ఏవైనా గాయాలు ఉన్నట్లయితే అందుబాటులో ఉన్న వైద్యులను వెంటనే సంప్రదించాలని తెలిపారు. అలాగే గ్రామంలో ఉన్న వారందరికీ డాక్సి సైక్లిన్ ట్యాబ్ లెట్లు అందజేయడం జరిగిందని వైద్యులు పేర్కొన్నారు. మరో విడత కూడా అందించేందుకు సిద్దంగా ఉన్నామని వివరించారు. గ్రామానికి 25వేల మాత్రల ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.మీనాక్షి పంపించారని తెలియజేశారు.
అయితే వ్యాధికి కారణం అయిన పురుగులు ఎక్కువగా వ్యవసాయ భూములలో పెరుగుతుంటాయని వాటి సోర్స్ ఎక్కడ ఉందో కూడా గుర్తించడం జరిగిందని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. వైద్య శిబిరం గ్రామంలో కొనసాగుతుండడం, పాజిటివ్ వచ్చిన వారిని చికిత్స కోసం రిమ్స్ లోని ప్రత్యేక వార్డుకి తరలించడం వంటి వాటిలో వారు హడలిపోతున్నారు. ప్రస్తుతానికి గ్రామంలో జ్వరాల తీవ్రత ఏమి లేదని, పరీక్షలను కొనసాగిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. మందులు అన్ని సిద్ధంగా ఉన్నాయని ప్రజలెవ్వరూ భయ పడద్దని పేర్కొంటున్నారు. చిన్న పాటి జ్వరాలు ఉన్న వెంటనే వైద్య శిబిరంలో అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందిని సంప్రదించి సేవలు పొందాలని వారు ప్రజలకి సూచిస్తున్నారు.