Tirumala News: తిరుమలకు నీటి గండం పొంచి ఉందా? 4 నెలల్లో ముప్పు తప్పదా ?
Tirumala News: తిరుమల లో ఐదు డ్యామ్ లు ఉన్న నీరు మరో 120 నుంచి 130 రోజులకి మాత్రమే వస్తుంది. త్వరలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే బక్తులకి నీటి సమస్య ఉండే అవకాశం ఉంది.
Tirumala News: తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం... నిత్యం లక్షలమంది భక్తిప్రపత్తులు ఇక్కడికి వస్తుంటారు. భక్తుల సౌకర్యాలకు టీటీడీ పెద్ద పీట వేస్తుంది. భక్తుల సేవకు రానున్న రోజుల్లో దేవుడే దిక్కుగా మారాడు. తిరుమల శ్రీవారిని ప్రతిరోజు 65 నుంచి 80 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల లో నిత్యం లక్షలాదిమంది భక్తులు వస్తుంటారు. సాధారణ రోజుల్లో పరిస్థితి ఇలా ఉంటే... ప్రత్యేక రోజులు.. ముఖ్యమైన ఉత్సవాలు... బ్రహ్మోత్సవాల సమయంలో అయితే ఆ లెక్క నాలుగు రెట్లు పెరుగుతుంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఒక గరుడ సేవ రోజు మాత్రమే 3 నుంచి 5 లక్లల మంది... ఇతర రోజుల్లో రోజుకు 2 లక్లల మంది తరలివచ్చే అవకాశం ఉంది. తమిళ పెరటాసి మాసంలో అయితే ఆ సంఖ్య బ్రహ్మోత్సవాలకు ఏ మాత్రం తగ్గకుండా భక్తులు వస్తారు.
ఆశించిన వర్షాలు లేక సమస్య
ఇంతవరకు అన్నీ బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు తిరుమలను నీటి కొరత పెద్ద సమస్యగా మారుబోతోంది. దేశంలో చాల ప్రాంతాల్లో వరదల కారణంగా వస్తున్న నష్టాలు చూస్తున్నాం. కాని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాలేదు. గతేడాది కురిసిన వర్షాలు తప్ప ఈ సంవత్సరం వర్షపాతం నమోదు చాల తక్కువగా ఉంది. ఈ వర్షపాతం తగ్గడం వల్ల రానున్న రోజుల్లో భక్తులకు నీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది.
Also Read: ఏపీలో 5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడికి బ్రూక్‌ఫీల్డ్ గ్రీన్ సిగ్నల్
130 రోజులకు నీరు
తిరుమలలో ఇప్పటివరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. స్థానికులు, యాత్రికుల నీటి అవసరాలు తీర్చడానికి ఐదు డ్యామ్‌లలో లభ్యమయ్యే నీటిని వాడుతున్నారు. తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్‌లలో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు. అయితే తిరుమలలో 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం డ్యామ్‌లలో ఉన్న నీరు రాబోయే 120 నుంచి 130 రోజుల వరకు మాత్రమే వస్తుందని టీటీడీ అధికారికంగా ప్రకటించారు. తిరుమలలో ప్రతి రోజూ 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. ఇందులో 18 లక్షల గ్యాలన్ల నీరు తిరుమల డ్యాముల నుంచి మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుంచి సేకరిస్తున్నారు.
దేవుడు కరుణించాలి
తిరుమలలో అక్టోబరు 4 నుంచి 12 వరకు వార్షిక బ్రహ్మోత్సవాల వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులతోపాటు ఆ తరువాత తిరుమలకు వచ్చే భక్తులకు నీటి సమస్య లేకుండా చేయడమే టీటీడీ ముందు ఉన్న ప్రాథమిక బాధ్యత. తిరుమలను సందర్శించే వేలమంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా, నీటి వృథాను అరికట్టాలని, నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని టిటిడి నిర్ణయించింది. నీటి వృథా అరికట్టాలని భక్తులతో పాటు స్థానికులకు విజ్ఞప్తి చేస్తోంది. నీరు అయిపోకముందే వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిస్తే తప్ప ఈసారి తిరుమలలో నీటి సమస్యకు పరిష్కారం దొరికే ఛాన్స్ లేదని విశ్లేషకులు అంటున్నారు.
Also Read: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి దంపతులు