Tirumala Free Meals: శ్రీవారి భక్తులకు సంప్రదాయ భోజనం... ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆహారం... సెప్టెంబరు 8 వరకు ప్రయోగాత్మకంగా అమలు
శ్రీవారి భక్తులకు రుచికరమైన సంప్రదాయ భోజనాన్ని అందిస్తుంది టీటీడీ. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆహారాన్ని తయారుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలతో భక్తులు వస్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం గంటల కొద్ది క్యూలైన్లలో వేచిచూస్తుంటారు. వైకుంఠనాధుడ్ని దర్శించుకుని తరించిపోతుంటారు. శ్రీవారి భక్తుల కోసం టీటీడీ అన్ని సదుపాయాలు చేస్తుంది. తాజాగా శ్రీవారి భక్తులకు రుచికరమైన సంప్రదాయ భోజనం వితరణను చేపట్టింది టీటీడీ. తిరుమల అన్నమయ్య భవనంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆహారాన్ని అందిచేందుకు సిద్ధమైంది.
సెప్టెంబర్ 8వ వరకు
సెప్టెంబర్ 8వ తేదీ వరకు సంప్రదాయ భోజనాన్ని అందచేసి భక్తుల అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతోంది. గోవుల ఉత్పత్తులతో శ్రీనివాసుడికి నైవేద్యం సమర్పిస్తున్నట్లు తెలిపింది. ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలతో అల్పాహారం, భోజనం భక్తులకు అందించనున్నట్లు తెలిపింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా తితిదే గురువారం ప్రారంభించింది.
లాభాపేక్ష లేకుండా
దేశీయ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన బియ్యం, పప్పు దినుసులతో తయారు చేసిన అల్పాహారం, భోజనాన్ని భక్తులకు అందిస్తుంది. లాభాపేక్ష లేకుండా వాటి తయారీకి అయ్యే ఖర్చుకు సమానమైన ధరకే భక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయించింది. భక్తుల అభిప్రాయాలు తీసుకునేందుకు సెప్టెంబరు 8వరకు రోజుకు 200 మందికి ఈ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అందిస్తున్నారు.
కుల్లకారు బియ్యంతో ఇడ్లీలు
గో ఆధారిత వ్యవసాయంతో పండించిన దేశీయ బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలను తితిదే కొనుగోలు చేయడం అభినందనీయమని దేశీయ వ్యవసాయ పరిశోధకులు విజయరామ్ అన్నారు. చిరు ధాన్యాలు, కుల్లకారు బియ్యంతో ఇడ్లీలు, కాలా బాత్ బియ్యంతో ఉప్మా తయారు చేశామని ధాన్యాల ఆహార నిపుణుడు రాంబాబు తెలిపారు. మధ్యాహ్నం కొబ్బరి అన్నం, పులిహోర, పూర్ణాలు, పచ్చి పులుసు, దోసకాయ పప్పు తదితర 14 రకాల వంటకాలు భక్తులకు అందించామన్నారు.
Also Read: Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి అంత మాట అనేశారే.. రేవంత్ రెడ్డిపై అసంతృప్తే కారణమా?
Also Read: TTD Employees: ఇంటి దొంగలపై టీటీడీ కొరడా.. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణంలో ఆరుగురిపై వేటు