Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి అంత మాట అనేశారే.. రేవంత్ రెడ్డిపై అసంతృప్తే కారణమా?
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రాంపూర్ తండాలో గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి దళిత వ్యక్తికి వచ్చేలా తాను చొరవ చూపుతానని వ్యాఖ్యానించారు. అందుకోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో తాను మాట్లాడి, వారిని ఒప్పించి దళితుడిని లేదా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తికేకి సీఎం పదవి వచ్చేలా ప్రయత్నం చేస్తానని కోమటిరెడ్డి చెప్పారు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రాంపూర్ తండాలో గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
దళిత బంధు పథకం గురించి మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం మాయమాటలు చెప్పి గెలవాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. నిధులు విడుదలైనా.. సీఎం దత్తత గ్రామం వాసాలమర్రి దళితులకు ఇప్పటి వరకు ఎందుకు దళిత బంధు డబ్బులు ఇవ్వలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కలెక్టర్ ఖాతాలో డబ్బులుంటే అవి దళితులకు ఏ విధంగా చెందినట్లు అవుతాయని ప్రశ్నించారు. అధికారులతో మాట్లాడితే దళితులకు అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్నారని అన్నారు.
ఫాం హౌస్‌కు రోడ్డు కోసమే..
తన పార్లమెంట్ నియోజకవర్గంలోని వాసాలమర్రిలో సభ నిర్వహించి కనీసం తనకు సమాచారం ఇవ్వకపోవడం ఏంటని కోమటిరెడ్డి ప్రశ్నించారు. తనను పిలిస్తే దళితబంధుతో పాటు ఇతర కులాలకు కూడా లబ్ధిచేకూరేలా ప్రశ్నిస్తాననే ఉద్దేశంతోనే ప్రొటోకాల్ పాటించకుండా సభ నిర్వహించారని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ వాసాలమర్రికి వస్తే అడ్డుకుంటామన్నారు. ఫాం హౌస్‌కు నేరుగా రోడ్డు కోసమే వాసాలమర్రి ప్రజలకు కేసీఆర్ ఎర వేశారని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేసింది నిజం కాదా? అని నిలదీశారు. గతంలో దళితులకు మూడెకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ కాళ్ల కింద ఉన్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని విడిపించాలని డిమాండ్ చేశారు.
Also Read: Gold-Silver Price: బంగారం కొనాలా? తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేడు మీ నగరంలో ఇలా..
చర్చనీయాంశంగా కోమటిరెడ్డి వ్యాఖ్యలు
అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత వ్యక్తికి సీఎం పదవి అన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. టీపీసీసీ పదవి తనకు కాకుండా రేవంత్ రెడ్డికి వచ్చిందని ముందు నుంచి ఆయన అసహనంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో రేవంత్ రెడ్డిపై ఎన్నో విమర్శలు కూడా చేశారు. పీసీసీ పదవిని ఢిల్లీ వెళ్లి కొనుక్కున్నారని ఆరోపణ చేశారు. అప్పటి నుంచి రేవంత్‌కు కోమటిరెడ్డి దూరంగానే ఉంటున్నారు. ఆ అసంతృప్తితోనే కోమటిరెడ్డి తాజా వ్యాఖ్యలు చేసినట్లుగా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read: Nirmal News: భార్య చేసిన ఆ తప్పు భర్తను చంపేసింది.. బంధువులున్నా అనాథల్లాగా మారిన పిల్లలు