AP New Property Tax: ఏపీలో అమల్లోకి కొత్త ఆస్తి పన్ను... ఏప్రిల్ ఒకటి నుంచి లెక్కిస్తున్నట్లు నోటీసులు.. పట్టణ స్థానిక సంస్థల్లో గెజిట్ నోటిఫికేషన్లు
ఏపీలో కొత్త ఆస్తి పన్ను విధానం అమలకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే చాలా పుర, నగర పాలక సంస్థల్లో తుది నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.
ఏపీలో కొత్త ఆస్తి పన్ను విధానం అమల్లోకి వచ్చినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొత్త ఆస్తి పన్ను విధానంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా ప్రభుత్వం ముందడుగు వేసింది. పన్ను విధానంపై ఆందోళనలు, లిఖితపూర్వకంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు ప్రజలు. అయితే అధికారులు మాత్రం ఈ విధానానికి అనుకూలంగా తీర్మానాలు చేస్తు్న్నారు. ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. స్థానిక సంస్థల్లో ఆధిక్యం కలిగిన అధికార పార్టీ సభ్యులు ఈ తీర్మానాలకు అనుకూలంగా స్పందించారు.
25 వేలకు పైగా అభ్యంతరాలు
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే పట్టణ స్థానిక సంస్థల్లో కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చినట్లు అధికారులు జిల్లా గెజిట్‌లో ప్రచురిస్తున్నారు. ఈ ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేసి సెప్టెంబరు 15లోగా ఇళ్లు, భవనాల వారీగా స్పెషల్ నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వార్షిక అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్ను స్థానంలో ఆస్తి మూలధన విలువపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ధరల ఆధారంగా పుర, నగర పాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో పన్నులు వేసే కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ విధానం వల్ల పన్నులు భారీగా పెరుగుతాయని ప్రజలు వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణలోనూ అభ్యంతరాలు తెలిపారు. కొత్త పన్ను విధానంపై పట్టణ స్థానిక సంస్థలు జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ల పైనా 25 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి.
పుర, నగర పాలక సంస్థల్లో గెజిట్
విశాఖలో అత్యధికంగా 9 వేలకు పైబడి అభ్యంతరాలు వచ్చాయి. దాదాపుగా పట్టణ స్థానిక సంస్థలన్నింటిలో అధికార పార్టీకి మెజారిటీ ఉండటంతో ఈ విధానానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్మానాలు చేయడంతో కొత్త ఆస్తి పన్ను వివరాలతో అధికారులు తుది నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 45% వరకు పుర, నగర పాలక సంస్థల్లో గెజిట్ ప్రచురించారు. స్పెషల్ నోటీసులు అనుగుణంగా 2021-22 సంవత్సరానికి ప్రజలు పన్ను చెల్లించాలి. పాత విధానం ప్రకారం ఇప్పటికే చాలా మంది మొదటి అర్ధ సంవత్సర పన్ను చెల్లించేశారు. వారంతా పెరిగిన మిగతా మొత్తానికి చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. మార్చిలోగా ఏడాది పన్ను మొత్తం ప్రజలు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు.