Peddireddy: బాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు, ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఏంటి? - పెద్దిరెడ్డి కామెంట్స్
Kadiri News: కదిరి నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Minister Peddireddy Ramachandra Reddy: ఇంగ్లీష్ మీడియం ఎందుకు అంటున్న వెంకయ్య నాయుడు, చంద్రబాబు తమ పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదివారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవొచ్చు కానీ పేద పిల్లలు చదవకూడదా? అని నిలదీశారు. కదిరి నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నిర్వహిస్తున్న వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. ముందుగా తనకల్లు మండలంలో నిర్వహిస్తున్న వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పోలియో ఆదివారం కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారు. ప్రతి ఇంటిలో ఏదో ఒక రూపంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సహాయం అందించింది. ఆసరాతో పాటు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్ ది. చంద్రబాబు 2014 లో వంద పేజీల మానిఫెస్టో లో 600 హామీలు ఇచ్చారు. ఎన్నికలు పూర్తవగానే ఆ మానిఫెస్టో ను వెబ్ సైట్ నుండి తొలగించారు. 14 వేల కోట్లు ఉన్న డ్వాక్రా అప్పులు నాడు తీర్చలేదు... నేడు వడ్డీతో కలిపి దాదాపు 24 వేల కోట్లు వైఎస్ జగన్ చెల్లించారు.
చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా? రైతులను, మహిళలను, యువతను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి, అధికారంలోకి రాగనే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. చంద్రబాబు భవిష్యత్తు కే గ్యారెంటీ లేదు... అయన ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తారా? ఎన్నికల సమయం రాగానే ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మనకు రెట్టింపు బడ్జెట్ కావాలని సిఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా వివరించారు
చంద్రబాబు ఇచ్చే హామీలు అన్ని బూటకపు హామీలు. చంద్రబాబు హామీలు నెరవేరుస్తారా లేదా అన్నది ప్రజలు ఆలోచన చేయాలి. విద్య వైద్యాన్ని ఎన్నడూ లేని విధంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్ మీడియం ఎందుకు అంటున్న వెంకయ్య నాయుడు, చంద్రబాబు తమ పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ మీడియం లో చదివారు? మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవొచ్చు, పేద పిల్లలు చదవకూడదా? చంద్రబాబు ప్రతి మహిళకు కేజీ బంగారం ఇస్తాను, ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తాను అని అంటారు. ప్రజలు ఎవ్వరూ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. మీకు మంచి జరిగుంటేనే ఓటు వేయండి అని చెప్పే దైర్యం సిఎం జగన్ కు ఉంది. సీఎం జగన్ మరోసారి అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి, మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయి’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.