Raj Tarun: మళ్లీ తెరపైకి హీరో రాజ్ తరుణ్ కాంట్రవర్శీ - అనుచరులతో దాడి చేశారంటూ కంప్లైంట్
Lavanya Raj Tarun: యంగ్ హీరో రాజ్ తరుణ్‌పై మరోసారి కేసు నమోదు చేశారు పోలీసులు. తనపై దాడి చేశారంటూ లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు.

Lavanya Complaint Against Raj Tarun: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తనపై దాడి చేశారంటూ లావణ్య మరోసారి ఆయనపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో నార్సింగి పీఎస్‌లో కేసు నమోదైంది.
మూడుసార్లు దాడి చేశారు
కోకాపేట విల్లాలో ఉండగా రాజ్ తరుణ్ తన అనుచరులతో దాడి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు లావణ్య. ఈ క్రమంలో ఆయనతో పాటు అనుచరులు మణికంఠ, రాజశేఖర్, అంకిత్ గౌడ్, సుశి, రవితేజలపై కేసు నమోదైంది. తనపై మూడుసార్లు దాడి చేసినట్లు చెప్పారు లావణ్య. '2016లో రాజ్ తరుణ్‌తో కలిసి కోకాపేటలో విల్లా కొనుగోలు చేశాం. వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని ఖాళీ చేశాడు. విల్లాలో నేను ఉంటున్న టైంలో రాజ్ అనుచరులు నాపై విచక్షణారహింతగా దాడికి పాల్పడ్డారు. గోల్డ్ కూడా ఎత్తుకెళ్లారు. ఇంటికి సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉండగానే ఈ దాడి జరిగింది.' అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: ఇప్పుడు బెల్లంకొండపై... సంక్రాంతికి చిరంజీవిపై... 'మిరాయ్', 'రాజా సాబ్' నిర్మాతపై సాహు గరమ్ గరమ్?
గతేడాది ఇదే లావణ్య రాజ్ తరుణ్‌పై కంప్లైంట్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనంగా మారింది. తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆయనతో పాటు నటి మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపైనా కేసు నమోదైంది. దీంతో ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ, ఏ3గా మయాంక్‌లను చేర్చారు. 2008 నుంచి రాజ్ తరుణ్‌కు తనకు పరిచయం ఉందని... 2010లో ప్రపోజ్ చేసి 2014లో తనను పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు లావణ్య. 2016లో తాను గర్భం దాల్చానని... తర్వాత అతను అబార్షన్ చేయించినట్లు తెలిపారు. నటి మాల్వీ పరిచయం అయ్యాకే రాజ్ తనకు దూరం అయ్యాడని... తాను ప్రశ్నిస్తే మాల్వీతో పాటు ఆమె సోదరుడు తనను బెదిరించారని వెల్లడించారు. లావణ్య ఫిర్యాదుతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే... 2013లో ఉయ్యాల జంపాల మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ, కుమారి 21F, ఈడో రకం ఆడో రకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, రంగుల రాట్నం, పవర్ ప్లే, అనుభవించు రాజా, నా సామిరంగ, పురుషోత్తముడు, భలే ఉన్నాడే మూవీస్ మంచి గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం పాంచ్ మినార్, గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీస్‌లో నటిస్తున్నారు.





















