Kavitha : కవిత సంచలన ఆరోపణలు: కేసీఆర్ చుట్టూ దెయ్యాలు, కేటీఆర్‌పై ప్రశ్నలు, హరీష్-సంతోష్‌లపై నిప్పులు! BRSలో ఏం జరుగుతోంది?
Kavitha : పార్టీలోనూ, కల్వకుంట్ల కుటుంబం విడిపోవడానికి కుట్రలు చేస్తోంది హరీశ్ రావు, సంతోష్ రావులేనని కవిత ప్రకటన చేశారు. దీంతో ఆ దెయ్యాలు అని కవిత ఎవరిని ఉద్దేశించి చెప్పిందో అందరికీ స్పష్టమైంది.

Kavitha : బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత, మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి. మీడియా సమావేశం ఆసాంతం చూస్తే, కవిత తండ్రికి సూచనలు, అన్నకు ప్రశ్నలు, హరీశ్-సంతోష్‌లపై నిప్పులు కురిపించారు. తండ్రి కేసీఆర్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై నిస్సహాయతతో ఉన్నారని, అన్నయ్య కేటీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇక తనకు వరస బావ అయిన హరీశ్ రావు, మరో సోదరుడు సంతోష్ పార్టీలోనూ, కుటుంబంలోనూ కుట్రలు చేస్తున్నారని తన ఆరోపణల ద్వారా స్పష్టం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు కుటుంబ కథా రాజకీయ చిత్రంగా ఉన్నాయన్న చర్చ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సాగుతోంది.
దెయ్యాలను దూరంగా పెట్టండి అంటూ తండ్రి కేసీఆర్‌కు కవిత సూచన
గతంలో తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కల్వకుంట్ల కవిత బహిరంగంగా వ్యాఖ్యానించారు. అయితే ఆ దయ్యాలు ఎవరు అన్న చర్చ తీవ్రంగా సాగింది. ఈ వ్యాఖ్యలు తన అన్న కేటీఆర్‌తోపాటు హరీశ్ రావు, సంతోష్ సహా మరికొందరు బీఆర్ఎస్ ముఖ్యనేతల పేర్లు మీడియాలో బాగా చర్చకు దారి తీశాయి. అయితే నేరుగా తండ్రి కేసీఆర్‌కు కవిత మీడియా ముఖంగా, పార్టీలోనూ, కల్వకుంట్ల కుటుంబం విడిపోవడానికి కుట్రలు చేస్తోంది హరీశ్ రావు, సంతోష్ రావులేనని స్పష్టంగా ప్రకటన చేశారు. దీంతో ఆ దెయ్యాలు అని కవిత ఎవరిని ఉద్దేశించి చెప్పిందో అందరికీ స్పష్టమైంది. వీరిద్దరిని పార్టీకి దూరంగా పెట్టాలని కవిత తన తండ్రి కేసీఆర్‌కు సూచన చేశారు. తనను బయటకు సాగనంపారని, అది కేటీఆర్‌కు, ఆ తర్వాత మీకు తప్పదు అని హెచ్చరిక సూచన కూడా చేయడం గమనార్హం. నిజాలు తెలుసుకుని సరైన నిర్ణయాలు తీసుకుని పార్టీని కాపాడాలని కేసీఆర్‌కు కవిత సూచన చేశారు.
"నేను నీ చెల్లెను, నాకు నీవు ఫోన్ చేయవా రామన్నా?" అంటూ కేటీఆర్‌కు కవిత ప్రశ్నలు
కల్వకుంట్ల కవిత తన తండ్రికి పార్టీ పరంగా పలు సూచనలు ఇస్తే, ఇక అన్న కేటీఆర్‌కు సూటి ప్రశ్నలు సంధించారు. తనపై కుట్ర జరుగుతుందని పార్టీ వేదికగా నేను నీ చెల్లిగా, మహిళగా బహిరంగంగా చెప్తే నాకు అన్నవైన రామన్నా, కనీసం ఫోనే చేయవా అంటూ కేటీఆర్‌ను మీడియా సమావేశంలో కవిత నిలదీయడం జరిగింది. మహిళా ఎమ్మెల్సీగా కూడా కనీస గౌరవం ఇవ్వరా అంటూ ప్రశ్నించడం జరిగింది. "అన్నా, నీవు నాతో మాట్లాడక నేటికి నూటా మూడు రోజులయింది" అంటూ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఈ విషయంలో తన తండ్రి కేసీఆర్ దగ్గర నుంచి స్పందన తాను ఆశించలేదని, కాని కేటీఆర్ నుంచి స్పందన రాకపోవడం ఏంటని, తనకే ఇలాంటి పరిస్థితి వస్తే ఇక మిగతా మహిళా నేతలు, కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా అంటూ కవిత సూటిగా ప్రశ్న వేశారు. ఈ వ్యాఖ్యలు గమనిస్తే అన్నచెల్లెళ్ళ మధ్య ఉన్న గ్యాప్‌ను, పార్టీలో మహిళా నేతల పట్ల ఉన్న చులకన భావాన్ని బయటపెట్టినట్లు అర్థమవుతుంది.
"కుట్రల వెనుక ఉన్నది హరీశ్ రావు, సంతోష్ రావులే" అంటూ నిప్పులు చెరిగిన కవిత
తమ కుటుంబాన్ని విడదీయడానికి, పార్టీ నుంచి తనను బయటకు పంపడానికి, పార్టీని చీల్చడానికి కుట్రలు జరుగుతున్నాయని, అందుకు కారణం పార్టీలో ముఖ్యనేతలైన హరీశ్ రావు, సంతోష్ రావులేనని కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు పార్టీ ఎన్నికల ఫండ్ ఇస్తే, హరీశ్ రావు అదనంగా తన సొంత డబ్బులు వారికి ఇచ్చి పార్టీని చీల్చే ప్రయత్నం చేశారని కవిత మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు జరిగిన తప్పులకు కేసీఆర్ బాధ్యులు కాదని, మంత్రిగా ఉన్న హరీశ్ రావే అని విమర్శలు చేశారు. హరీశ్ రావు వ్యవహార శైలి వల్ల జగ్గారెడ్డి, రఘునందన్ రెడ్డి, ఈటల రాజేందర్ వంటి నేతలు పార్టీని వీడి వెళ్లాల్సి వచ్చిందని కవిత ఆరోపించారు. హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదని, సమస్యలు సృష్టించి పరిష్కరించే డబుల్ షూటర్ అని కవిత ఎద్దేవా చేశారు. పార్టీని చీల్చి తన ప్రాబల్యం పెంచుకోవడమే లక్ష్యంగా హరీశ్ రావు పార్టీలో ఉండి పని చేస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రికి రాసిన లేఖను బయటపెట్టింది సంతోష్ రావేనని కవిత ఆరోపించారు. నేరెళ్ళలో దళితులను తీవ్రంగా కొట్టేందుకు పోలీసులను ఉసిగొల్పారని చెప్పారు. 'గ్రీన్ ఇండియా' అన్న పేరుతో సినిమా వాళ్లను మోసం చేసి, అటవీ భూమిలో వినోద కార్యక్రమాలు చేపట్టేలా జీవో తెచ్చుకున్న వ్యక్తి సంతోష్ రావు అని మండిపడ్డారు. సంతోష్ తన సొంత మనుషులకు పదవులు ఇప్పించుకున్నారని, వీరంతా రియల్ ఎస్టేట్, బిజినెస్ చేసే వ్యక్తులే తప్ప ప్రజలతో, ఉద్యమంతో సంబంధం లేని వారని కవిత తప్పుబట్టారు.
అయితే, పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కల్వకుంట్ల కవిత తను పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ మీడియా సమావేశాన్ని ఉపయోగించుకున్నారు. అంతేకాకుండా, పార్టీలోనూ, కుటుంబంలోనూ జరిగిన పరిణామాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తండ్రి కేసీఆర్‌కు సూచనలు చేయడం, అన్న కేటీఆర్‌కు సూటి ప్రశ్నలు వేయడం, పార్టీలో ముఖ్యులు అయిన హరీశ్ రావు, సంతోష్ రావులపై నిప్పులు చెరిగారు.






















