Chittoor District News: చిత్తూరు జిల్లాలో దారుణం.. ఆర్డీఓ ఏం చేశారంటే?
Chittoor District News: 76 ఏళ్ల స్వతంత్ర భారతావని. చంద్రుడిపై ప్రయోగాలు చేసి చరిత్ర సృష్టించే స్థాయికి ఎదిగింది. ఆధునికత అరచేతిలోకి వచ్చి మానవుడు ఆలోచన విధానాలు మారుతూ వస్తున్నాయి.
Chittoor District News: 76 ఏళ్ల స్వతంత్ర భారతావని. చంద్రుడిపై ప్రయోగాలు చేసి చరిత్ర సృష్టించే స్థాయికి ఎదిగింది. ఆధునికత అరచేతిలోకి వచ్చి మానవుడు ఆలోచన విధానాలు మారుతూ వస్తున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం నేటికి అంటరానితనం అనే రోగం మాత్రం సమాజాన్ని పట్టి వదలడం లేదు. సమాజం తలదించుకునే ఇలాంటి ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. హెయిర్ కటింగ్ కోసం సెలూన్ షాప్‌కు వెళ్లిన దళిత యువకుడిని దుకాణ నిర్వహకుడు అవమానించాడు.
దళితులకు జుత్తు కత్తిరించేది లేదని నిర్వాహకుడు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని గురంచి తెలుసుకున్న ఆర్డీఓ రంగంలోకి దిగారు. అక్కడికి వెళ్లి దళితులకు దగ్గరుండి హెయిర్ కట్ చేయించాడు. మరోక సారి ఇలాంటి ఘటన పునరావృతం ఐతే చట్టపరమైన చర్యలు తప్పవంటూ సెలూన్ షాప్ నిర్వహుకుడిని హెచ్చరించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు..
చిత్తూరు జిల్లా, బైరెడ్డిపల్లె మండలం, నెల్లిపట్ల గ్రామంలోని ఓ సెలూన్ షాప్ వద్దకు వారం రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ దళిత యువకుడు జుత్తు కత్తిరించుకోవడానికి వెళ్లాడు. అప్పటికే గ్రామాకు చెందిన మరొక వ్యక్తికి హెయిర్ కట్ చేస్తున్న దుకాణదారుడు. అక్కడికి వెళ్లిన దళిత యువకుడిని చూసిన నిర్వాహకుడు తమ సెలూన్ షాప్‌లో ఎస్సీ, ఎస్టీలకుహెయిర్ కట్ చేసేది లేదంటూ కులం పేరుతో దుషించాడు.
దీనిని అక్కడే ఉన్న కొంత మంది యువకులు వీడియో తీసి సోషల్ మీడియలో పెట్టారు. అది కాస్తా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం చిత్తూరు ఆర్డీఓ మనోజ్ కుమార్ రెడ్డి దగ్గరకు వెళ్లింది. ఈ వీడియోను చూసినా ఆర్డీవో రంగంలోకి దిగ్గారు. జిల్లా అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి నెల్లిపట్ల గ్రామంలో పర్యటించారు. దళితులతో కలిసి గుడికి వెళ్లిన ఆయన, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో కలిసి భోజనం చేశారు.
గ్రామంలోని ప్రజలందరిని పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలు అందరూ సమానమేనని, అన్ని కులాల వారు సోదరుల్లా కలిసి మెలిసి మెలగాలని సూచించారు. అంటరానితనం చూపిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో దళితులకు హెయిర్ కట్ చేయనని చెప్పిన సెలూన్ షాప్ వద్దకు వెళ్లారు. సెలూన్ షాప్ నిర్వహుకుడికి ఆర్డీఓ కౌన్సిలింగ్ ఇచ్చాడు. దేశంలో అందరూ సమానమేనని అన్నారు.
అనంతరం ఆర్డీఓ మనోజ్ కుమార్ దగ్గరుంచి దళితులకు హెయిర్ కట్ చేయించాడు. మరొకసారి ఇలాంటి ఘటన పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు తప్పవంటూ సెలూన్ షాప్ నిర్వహుకుడిని హెచ్చరించారు. గ్రామంలో అన్ని వర్గాల వారు ఉంటారని, అందరూ ఒకరినొకరు సహకరించుకుంటూ జీవిస్తేనే సమాజం అవుతుందన్నారు.
ఆర్డీఓపై ప్రసంశలు
దళిత యువకుడిపై వివక్ష ఘటనలో ఆర్డీఓ మనోజ్ కుమార్ రెడ్డి చూపిన చొరవ అందరిని ఆకట్టుకుంది. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి గ్రామానికి వెళ్లి సమస్యను పరిష్కరించడం, బలహీన వర్గాలకు అండగా నిలవడంపై సోషల్ మీడియాలో ప్రసంశలు వెల్లువెత్తున్నాయి. అంటరానితనం, వివక్ష నిర్మూలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం గొప్ప విషయం అని కొనియాడుతున్నారు.