Seva Tickets: నేడు శ్రీవారి సేవా టిక్కెట్లు విడుదల, ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్న టీటీడీ
Tirumala Seva Tickets: తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లను నేడు టీటీడీ విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈనెల 21 వరకు భక్తులు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు
Tirumala News: నేడు తిరుమల(Tirumala) శ్రీవారి మే నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ(TTD) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. లక్కీడిప్ టికెట్లు పొందినవారు అదే రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు రుసుము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని టీటీడీ అధికారులు వెల్లడించారు.
శ్రీవారి సేవా టిక్కెట్లు
తిరులమల శ్రీవారి సేవా టిక్కెట్ల(Seva Tickets)ను టీటీడీ నేడు విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్లో టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నాయి. మే నెల కోటా టిక్కెట్లను టీటీడీ అందుబాటులో ఉంచనుంది. శ్రీవారి సేవా టిక్కెట్లను ఎలక్ట్రానిక్ డిప్(Electranic Dip) కోసం ఈనెల 21 ఉదయం 10 గంటల వరకు భక్తులు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. అనంతరం లక్కీడిప్ ద్వారా టీటీడీ టిక్కెట్లు జారీ చేయనుంది. సేవాటిక్కెట్లు దక్కించుకున్న వారికి మెసెజ్ రూపంలో అధికారులు సమాచారం ఇవ్వనున్నారు. లక్కీడిప్ లో సేవా టిక్కెట్లు పొందిన భక్తులు అదే రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు సేవా రుసుము చెల్లించి టిక్కెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే శ్రీవారి సేవా టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. గతంలోనే ఈ టిక్కెట్లను నేరుగానే టీటీడీ(TTD) అందించేది. అయితే సేవా టిక్కెట్ల జారీలో పెద్దఎత్తున గోల్ మాల్ జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సామాన్య భక్తులకు తప్ప..వీవీఐపీ(VVIP)లకే టిక్కెట్లు కేటాయిస్తుండటంతో భక్తుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఎలక్ట్రానిక్ డిప్ పద్దతిని టిటీడీ తీసుకొచ్చింది. తొలిరోజుల్లో ఏరోజుకు ఆరోజే ఆన్ లైన్లో టిక్కెట్లు జారీ చేసినా....దీనిలోనూ గోల్ మాల్ జరుగుతున్నట్లు గ్రహించి పకడ్బందీగా ఎలక్ట్రానిక్ డిప్ పద్దతిలో టిక్కెట్ల జారీకి టిటీడీ అధికారులు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి మూడు రోజుల పాటు భక్తలందరూ తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. చివరిరోజు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టిక్కెట్లు పొందిన భక్తులకు జారీ చేస్తున్నారు.
విశిష్ట పూజా సేవలు
ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, వర్చువల్ సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్‌లైన్ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 24న మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయల కోటా టిక్కెట్లను విడుదల చేయనున్నారు.
ప్రత్యేక కోటా
వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి మే నెల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. మే నెల గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మ ధ్యాహ్నం 2 గంటల కు పరకామణి సేవా టికెట్ల కోటాను టీటీడీ అధికారులు ఆన్ లైన్‌లో విడుదల చేయనున్నారు.