Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
Tirumala News: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణంతో అంకురార్పణ జరిగింది. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు గరుడ పటాన్ని ఎగురవేశారు.
Tirumala Srivari Brahmotsavam Started: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Srivari Brahmotsavams) శుక్రవారం సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ (Dwajarohanam) ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అటు, కల్యాణవేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫలపుష్ప, అటవీ, శిల్ప, ఫోటో ప్రదర్శన శాలలను తితిదే శుక్రవారం ప్రారంభించింది. ప్రవేశ ద్వారంలో ఉంచిన దుర్యోధన పరాభవం, శేషాచల శ్రేణుల సెట్టింగ్, శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ శిల్పకళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు తయారు చేసిన చెక్క, సిమెంట్, లోహ శిల్పాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
DEITIES OF ALL WORLDS INVITED: DHWAJAROHANAM HELD
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) October 4, 2024
The deities of the 14 worlds were invited to the grand Navahnika Salakatla Brahmotsavams of Sri Venkateswara in Tirumala, starting with Dhwajarohanam on Friday. pic.twitter.com/Zwpf4pbUnm
ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు, ఆగమ సలహాదారులు, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
అటు, తిరుమల శ్రీవారికి సీఎం చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం వెండి పళ్లెంలో పట్టువస్త్రాలు తీసుకుని శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి అనంతరం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు తదితరులు సీఎం వెంట ఉన్నారు.
'వదంతులు నమ్మొద్దు'
తిరుమలలో అపచారం జరిగిందన్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఓ ప్రకటనలో స్పందించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా కొక్కి విరిగిందని.. అపశ్రుతి చోటు చేసుకుందని వస్తోన్న వార్తలపై స్పష్టత ఇచ్చింది. తిరుమలలో (Tirumala) ఎలాంటి అపచారం జరగలేదని.. ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మొద్దని స్పష్టం చేసింది. 'ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని సోషల్ మీడియాలో విస్తృతంగా వదంతులు వస్తున్నాయి. శ్రీవారి భక్తులు ఇలాంటి వార్తలు నమ్మొద్దు. సాధారణంగా బ్రహ్మోత్సవాలకు ముందే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసుకోవడం ఆనవాయితీ. అవసరమైతే వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చడం సంప్రదాయం. అందులో భాగంగానే భిన్నమైన ధ్వజపటం తాలూకు కొక్కిని అర్చకులు తొలగించి దాని స్థానంలో కొత్త దాన్ని ఏర్పాటు చేశారు. అంతలోపే దీన్ని అపచారం జరిగినట్లుగా కొన్ని ప్రసార మాధ్యమాలు ప్రసారం చేయడం దురదృష్టకరం. తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదు.' అని టీటీడీ స్పష్టం చేసింది.
No misdemeanour occurred in Tirumala.
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) October 4, 2024
On the first day of the Brahmotsavam, rumors circulated that the hook for the Garuda flag broke, suggesting misconduct.
TTD urges devotees not to believe these baseless claims. #Tirumala #Brahmotsavam #TTD pic.twitter.com/u32GX6Zhcb