Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
Tirumala Heavy Rush : వరుస సెలవులు, పెళ్లి ముహూర్తాలు కారణంగా తిరుమలలో భక్తులు రద్దీ అన్యూహంగా పెరిగింది. దీంతో ఆగస్టు 21 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.
Tirumala Heavy Rush : తిరుమలలో అన్యూహంగా భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లు అన్ని భక్తులతో నిండి పోయి, గోగర్భం డ్యాం వరకు భక్తులు క్యూ లైనులో వేచి ఉన్నారు. ఆగస్టు 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. వారాంతంలో వరుస సెలవుల రావడంతో తిరుమలలో అనూహ్యమైన రద్దీ నెలకొందన్నారు. సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 21వ తేదీ వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేశామన్నారు. శనివారం ఆక్టోపస్ భవనం సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు భక్తుల క్యూలైన్ చేరుకుంది. శ్రీవారి దర్శనానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతోంది. రాత్రి 8 గంటల వరకు 56,546 మంది యాత్రికులు దర్శనం చేసుకున్నారు. వరుస సెలవుల కారణంగా యాత్రికుల రద్దీ అనూహ్యంగా పెరిగిన కారణంగా తమ యాత్రను వాయిదా వేయాలని టీటీడీ భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేసింది.
భక్తులతో నిండిపోయిన క్యూ కాంప్లెక్స్ లు
ఆపద మొక్కులవాడు కొలువైయున్న దివ్య ధామం తిరుమల పుణ్యక్షేత్రం. ఏడుకొండల్లో నెలవైయున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించనిదే తిరిగి వెళ్ళరు. స్వామి వారిపై భక్తితో తలనీలాలు సమర్పించి స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే కోవిడ్ తరువాత గత కొంత కాలంగా తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల కళకళలాడుతుంది. ఎటు చూసిన భక్తుల గోవింద నామ స్మరణలతో ఏడు కొండలు మారుమోగుతున్నాయి. వరుస సెలవులు, వారంతరం కావడంతో తిరుమల పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 లోని కంపార్ట్మెంట్లు అన్ని భక్తులతో నిండి నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు భక్తుల నిండి పోవడంతో ఆళ్వార్ ట్యాంక్ మీదుగా లేపాక్షి సర్కిల్ నుంచి నందకం అతిధి గృహం వరకూ భక్తులు క్యూలైన్స్ లో వేచిఉన్నారు.
సిఫార్సు లేఖలు రద్దు
తిరుమల కొండ భక్తజనంతో నిండి పోయింది. దీంతో టీటీడీ యాత్ర సదన్, కల్యాణ కట్ట, అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అఖిలాండం, ఇతర యాత్రా ప్రదేశాలు వంటి ప్రాంతాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేలాది సంఖ్యలో భక్తులు వివిధ మార్గాల ద్వారా ఒక్కసారిగా కొండకు చేరుకోవడంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలను టీటీటీ మరమ్మతులు చర్యలు చేపట్టడంతో ఉన్న గదులనే భక్తులకు కేటాయిస్తున్నారు అధికారులు. దీంతో రూములు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరు బయటనే నిద్రిస్తున్నారు. భక్తుల ఇబ్బందులను టీటీడీ దృష్టిలో ఉంచుకొని భక్తులు అధికంగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో పుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి అల్పాహారంతో పాటు పాలు, మజ్జిగ అందిస్తుంది. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తూ శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో సిఫార్సు లేఖలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం ప్రోటోకాల్ భక్తులకే పరిమితం చేసింది. ఇక ఆన్లైన్ ద్వారా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులకు మూడు గంటల సమయంలోనే స్వామి వారి దర్శనం లభించగా, సామాన్య భక్తులకు "26 గంటల సమయం" పడుతుంది. స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో పాలు, అల్పాహారం వితరణ కార్యక్రమాన్ని టీటీడీ చేపడుతుంది. శని, ఆదివారాలు కావడంతో స్వామి వారి దర్శనం అధికంగా చేరుకునే అవకాశం ఉంది. సప్తగిరులు భక్తులతో కిటకిట లాడడంతో పాటుగా భక్తుల షాపింగ్ లతో దుకాణాలు కూడా రద్దీగా మారింది.