Amaravati Farmers : అధికార అడ్డంకుల్ని అధిగమించి దిగ్విజయంగా దేవస్థానానికి.. ముగింపునకు చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర !
అధికార పార్టీ సృష్టించిన అడ్డంకులు, ఫేక్ ప్రచారాలు, లాఠీచార్జ్‌లు చివరికి ప్రకృతి సృష్టించిన అడ్డంకులను దాటుకుని అమరావతి రైతుల పాదయాత్ర తిరుపతికి చేరుకుంది.
రాజధాని కోసం అని వారు సర్వస్వంగా భావించే భూములను ఇచ్చారు. పైసా తీసుకోకుండా రాష్ట్రంతో పాటు తామూ బాగుపడదామనుకున్నారు. కానీ వారికి కాలం కలసి రాలేదు. రాష్ట్రంతో పాటు తామూ మునిగిపోయే పరిస్థితి వచ్చిందని పోరుబాట పట్టారు. లాఠీ దెబ్బలు తిన్నారు. కేసులు ఎదుర్కొన్నారు. జైళ్లకు వెళ్లివచ్చారు. అయితే న్యాయం వారికి అండగా నిలబడింది., దైవం కూడా కరుణించాలని వారంతా న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుపతికి పాదయాత్ర సంకల్పించారు. అందులోనూ ఎన్నో అవాంతరాలు. లాఠీచార్జ్‌లు చూశారు. భోజన ఏర్పాట్లనూ అడ్డుకున్న పరిస్థితులు ఎదుర్కొన్నారు. విరుచుకపడిన ప్రకృతి విపత్తులను భరించారు. చివరికి దేవస్థానం చేరుకున్నారు.
45 రోజులు... !
వెయ్యి కిలోమీటర్లకుపైగా దూరం ..!
లక్షల మంది ఆకాంక్ష... !
మార్గ మధ్యలో మరెన్నో ఒడిదుడుకులు..!
ఇది సింపుల్‌గా అమరావతి రైతుల చేపట్టిన పాదయాత్ర. ఒకటే రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ అప్పటి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన పాదయాత్ర ముగింపునకు చేరింది. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో నవంబర్ నుంచి ఈ పాదయాత్ర చేపట్టారు రైతులు.
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నినాదం అందుకున్నప్పటి నుంచి ఉద్యమబాటలో ఉన్న రైతులు ఏదో రూపంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. వివిధ రూపాల్లో ఉద్యమ తీవ్ర పెంచుతూ వస్తున్నారు. న్యాయస్థానాల్లో పోరాడుతూనే ప్రజాక్షేత్రంలో కూడా మద్దకు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టారు. అమరావతి రైతులు ఆలోచనకు ప్రభుత్వం మొదట్లో అంగీకరించలేదు. పోలీసు శాఖ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టే పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు. అన్నీ పరిశీలించిన న్యాయస్థానం... షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో పోలీసులు కూడా సైలెంట్ అయిపోయారు. ఇన్ని సస్పెన్స్‌ల మధ్య నవంబర్ 1న పాదయాత్ర ప్రారంభమైంది.
అమరావతి నుంచి అన్ని జిల్లాలు దాటుకొని వచ్చిన పాదయాత్రకు ప్రజలను సాదర స్వాగతం పలికారు. ఎక్కడ ఎలాంటి అడ్డంకులు కనిపించలేదు. వర్షాలు, వరదలు కారణంగా చాలా రోజులు పాదయాత్రకు బ్రేక్‌లు పడ్డాయి. అయినా రైతులు ఎక్కడా వెనకడుగు వేయలేదు. మధ్య మధ్యలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకులు వచ్చి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. రాజకీయ నాయకులు రావడంపై పోలీసులు ఒకట్రెండు సార్లు అభ్యంతరాలు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో కేసులు కూడా పెట్టారు. కరోనా నిబంధనలు పాటించడం లేదని కేసులు రిజిస్టర్ చేశారు.
Also Read: ఏపీ హైకోర్టుకు అదనపు భవనం.. భూమి పూజ చేసిన చీఫ్ జస్టిస్ !
చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు కానీ కొందరు మేధావులు మాత్రం తమకు మూడు రాజధానులు కావాలని డిమాండ్ చేశారే తప్ప రైతుల పాదయాత్రపై ఎలాంటి ఆటంకం కలిగించలేదు. ఆఖరి రోజు మాత్రం చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ కనిపించిన ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి. రైతులతో తమకు ఎలాంటి వివాదాలు గొడవలు లేవని... తమకు మాత్రం మూడు రాజధానులే కావాలంటూ ఆ ఫ్లెక్సీల్లో ఉంది. ఇది మినహా ఎక్కడా పాదయాత్ర ఆసాంతం ఎక్కడా ఎలాంటి దుస్సంఘటనలు జరగలేదు. మధ్యలో ఓసారి పోలీసులు చేసిన లాఠీ ఛార్జ్ కారణంగా ఓ రైతు గాయపడ్డారు.
Also Read: "హోదా" కోసం రాజీనామాలు చేద్దాం ..రా ! సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్ !
ఇప్పుడు అక్కడ బహిరంగ సభ ఏర్పాటుకు అమరావతి రైతులు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలితాయన్నది చర్చనీయాంశమైంది. ఎలాంటి బహిరంగ సభకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే రైతులు మాత్రం కోర్టులో పిటిషన్ వేశారు. తమ అభిప్రాయలు చెప్పుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ఎలాంటి సమస్యల్లేకుండా పాదయాత్ర చేపట్టామని... బహిరంగ సభ కూడా అలానే శాంతియుతంగా పూర్తి చేస్తామంటున్నారు.
Also Read: కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ .. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం