Payyavula : ప్రభుత్వం అప్పు చేసి వడ్డీ ప్రజలతో కట్టిస్తోంది .. విద్యుత్ చార్జీలపై కొత్త విషయాలు బయటపెట్టిన పయ్యావుల !
విద్యుత్ ట్రూ అప్ చార్జీలు ప్రభుత్వ నిర్వాకమేనని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ప్రభుత్వం అప్పులు చేసి వడ్డీలు ప్రజలతో కట్టిస్తోందని మండిపడ్డారు.
ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుడు నివేదికలు పెట్టి ప్రజలపై పెనుభారం మోపుతోందని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. రెండు నెలలుగా వసూలు చేస్తున్న ట్రూ అప్ చార్జీలు ప్రభుత్వం తప్పుడు నివేదికలతో విధించిందని ఆరోపించారు. డిస్కంలు తమకు నష్టాలు వస్తున్నాయని ఈఆర్సీ ముందు తప్పుడు నివేదికలు పెట్టాయన్నారు. ఆర్టీపీఎస్, వీటీపీఎస్, కృష్టపట్నం వవర్ ప్లాంట్ వంటి వాటి నుంచి విద్యుత్ ఉత్పత్తిని తగ్గించి బయట ప్రాంతాల నుంచి విద్యుత్ కొనుగోలు చేశారని.. ఈ ఒప్పందాలన్నీ బయట పెట్టాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
డిస్కంలకు ప్రభుత్వం రూ. 20వేల కోట్ల బకాయి ఉందని వాటిని ఎందుకు చెల్లించడం లేదని పయ్యావుల ప్రశ్నించారు. ఈ బకాయిలను చెల్లించకుండా బకాయిలు వున్నాయని.. వాటిని ప్రజల నుంచి వసూలు చేసే ప్రయత్నం చేయడంపై మండిపడ్డారు. ప్రజలపై మాత్రమే ట్రూఆప్ చార్జెస్ పేరుతో భారం వేసి ప్రభుత్వం దోపిడీ చేస్తోందంటూ మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులకు ఈఆర్సీ తల వంచాల్సి వస్తుందని ఆయన విమర్శించారు.
Also Read : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై సీబీఐ విచారణ కొనసాగింపు.. సుప్రీంకోర్టు ఆదేశం
ఇప్పటికే ఆర్టీపీఎస్ ప్లాంట్‌ను మూసేసే స్థాయికి తీసుకువచ్చారని.. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రైతులకు ప్రభుత్వం వైపు నుంచి ఇస్తున్న సబ్సిడీలను.. డిస్కంలకు సకాలంలో చెల్లించకపోతే.. వాటిని కూడా రైతుల నుంచే వసూలు చేసుకునేందుకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనుమతి ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఇదే జరిగితే రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడమే కాదు చార్జీలు కూడా వసూలు చేస్తారని ఆయన విశ్లేషించారు. డిస్కంలకు ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన బకాయిలు చెల్లించిన తర్వాతనే ప్రజల నుంచి ఈఆర్సీ ద్వారా వసూలు చేయాలని పయ్యావుల డిమాండ్ చేశారు. విద్యుత్ చట్టాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయన్నారు.
Also Read : "మా"కు మోడీకి ఏంటి సంబంధం ? "అతి" స్థాయికి చేరిన తారల ఎన్నికల రగడ !
ప్రభుత్వం చేస్తున్న తప్పులకు ఈఆర్సీ బాధ్యత వహించాల్సి ఉంటుందని పయ్యావుల స్పష్టం చేశారు. రెండు నెలలుగా వసూలు చేస్తున్న ట్రూ ఆప్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఈఆర్సీని పయ్యావుల డిమాండ్ చేశారు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈఆర్సీ విచారణ చేస్తే వాస్తవాలు వెల్లడవుతాయన్నారు.
Also Read : డ్రగ్స్ స్కాంపై చేసిన ఆరోపణలకు ఆధారాలివ్వండి ..ధూళిపాళ్లకు కాకినాడ పోలీసుల నోటీసులు !