Breaking News Live: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు వాయిదా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 27న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 27న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు వాయిదా పడ్డాయి. అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. గులాబ్ తుపాను కారణంగా ఏపీతో పాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు సభాపతి, ప్రొటెం ఛైర్మన్ సోమవారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు సహాయచర్యల్లో పాల్గొనాల్సినందున నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గులాబ్ ప్రభావంతో ఏపీలో 1.63 లక్షల ఎకరాల్లో పంట నష్టం
గులాబ్ తుపాను కారణంగా పంట నష్టంపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ప్రాథమిక అంచనా ప్రకారం 1.63 లక్షల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయని వెల్లడించారు. పారదర్శకంగా పంట నష్టం అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు, అధికారులు పర్యటించాలని సూచించారు.
ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో తుపాను ప్రభావం, పంట నష్టం ఎక్కువగా ఉందన్నారు. వ్యవసాయ సలహా మండళ్ల సభ్యులు కూడా గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా నిలవాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా గులాబ్ తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రేపు(మంగళవారం) ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు అని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా
గులాబ్ తుపాను కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో 28, 29 తేదీల్లో జరగాల్సిన ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో జరిగే పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామో తర్వాత వెల్లడిస్తామన్నారు.
పవన్ కళ్యాణ్ కామెంట్లపై స్పందించిన పోసాని.. జగన్ కోసం మాట్లాడతానంటూ కౌంటర్
రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. మీడియాలో వచ్చిన విషయాలపై ప్రశ్నించే హక్కు పవన్‌కు ఉందన్నారు. అయితే సాధారణంగా పవన్ తనను తానే ప్రశ్నించుకుంటారని, దానికి జవాబులు సైతం పవన్ చెప్పుకుంటారని పోసాని పేర్కొన్నారు. సమాజం కోసం మాట్లాడతా అని పవన్ చెబుతారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తనకు అభిమానం ఉందన్నారు. జగన్ కోసం మాట్లాడతూ అని పోసాని అన్నారు.