AP Assembly News: ఏపీ అసెంబ్లీలో వెనక్కితగ్గని టీడీపీ నేతలు - నేడు 11 మంది సస్పెన్షన్
AP Assembly News: ఏపీలో ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా.. ప్రశ్నోత్తరాలు చేపట్టాల్సి ఉంది. టీడీపీ సభ్యులు ప్రశ్నోత్తరాలకు అడ్డుతగిలారు.
TDP Leaders Suspension in AP Assembly: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల గందరగోళంతో ఆ పార్టీకి చెందిన 11 మంది సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ (Tammineni Seetharam) సస్పెండ్ చేశారు. ఈ ఒక్కరోజు సెషన్‌కు మాత్రమే వారిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. అశోక్ బేందాలం, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చిన్నరాజప్ప, వెంకటనాయుడు, జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామక్రిష్ణ, మంతెన రామరాజు, రవికుమార్ గొట్టిపాటి, సాంబశివరావు ఏలేరు, సత్యప్రసాద్ అనగానిను సస్పెండ్ చేశారు. వీరు తక్షణం సభ వదిలి వెళ్లాలని స్పీకర్ ఆదేశించారు. అంతకుముందు సభ రెండుసార్లు వాయిదా వేసినప్పటికీ టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సస్పెండ్ చేశారు.
ఏపీలో ఏడో రోజు ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు ప్రారంభం సందర్భంగా.. ప్రశ్నోత్తరాలు చేపట్టాల్సి ఉంది. పలు శాఖల బడ్జెట్ డిమాండ్లపై చర్చించాల్సి ఉంది. సాంఘిక, గిరిజన, బీసీ, మహిళ, శిశు, మైనారిటీ సంక్షేమం, గృహనిర్మాణ శాఖల పద్దులపై చర్చించనున్నారు. అయితే, సభలో పలు శాఖల డిమాండ్లను మంత్రులు ప్రవేశపెడుతుండగా.. టీడీపీ సభ్యులు ప్రశ్నోత్తరాలకు అడ్డుతగిలారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. జంగారెడ్డి గూడెంలో జరుగుతున్న మరణాలపై జ్యుడీషియల్ విచారణకు టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో అసత్యాలా అంటూ నిలదీస్తూ ఆందోళన చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఎలా ప్రవర్తించాలో తెలియని మీరు ఎమ్మెల్యేలా అంటూ వ్యాఖ్యానించారు. అయినా సభలో ఆందోళన కొనసాగడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
అంతకుముందు టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ (Buggana Rajendranath Reddy) మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు రోజూ సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ సభ్యుల తీరును ఆయన తప్పుబట్టారు. శవ రాజకీయాలు చేయడంలో టీడీపీ నేతలు దిట్ట అని మంత్రి కురసాల కన్నబాబు (Kurasala Kannababu) ఆరోపించారు. శవ రాజకీయాలకు టీడీపీ పేటెంట్ అని ఎద్దేవా చేశారు. 2015లో గోదావరి పుష్కరాల్లో చనిపోయిన వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారా? అని మంత్రి ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెంలో పరామర్శకు చంద్రబాబు (Chandrababu) రాజకీయ యాత్ర తరహాలో వెళ్లారని దుయ్యబట్టారు. టీడీపీ ప్రతిరోజూ స్పీకర్ చైర్‌ను కించపరిచేలా ప్రవర్తిస్తోందని అన్నారు. చంద్రబాబుకు భవిష్యత్తుపై ఆశలు పోయాయని ఎద్దేవా చేశారు.
టీడీపీ బండారం బయటపెడతా: డిప్యూటీ సీఎం
టీడీపీ సభ్యులపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రేపు టీడీపీ నేతల బండారం బయటపెడతానని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల ఆరోపణలపై సమాధానం చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీడీపీకి సవాలు విసిరారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పబ్లిసిటీ తలకెక్కి తొక్కిసలాటలో 29 మంది చనిపోతే ఆ శవాలు అప్పుడు కనపడలేదా అని ప్రశ్నించారు.