Bonda Uma : చంద్రబాబుకు ఐటీ నోటీసుల వెనుక సీఎం జగన్ హస్తం - లాబీయింగ్‌తో ఇప్పించారని టీడీపీ ఆరోపణ!
చంద్రబాబుకు ఐటీ నోటీసుల వెనుక సీఎం జగన్ హస్తం ఉందని టీడీపీ ఆరోపించింది. లాబీయింగ్ చేసి నోటీసులు ఇప్పించారన్నారు.
Bonda Uma : చంద్రబాబుకు వచ్చిన ఐటీ నోటీసుల వెనుక సీఎం జగన్ మోహన్ రెడ్డి హస్తం ఉందని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. మంగళగిరిలో టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి, చంద్రబాబుకు తప్పుడు నోటీసులిప్పించారని ఆరోపించారు. ఇలా నోటీసులు ఇప్పించినంత మాత్రాన చంద్రబాబు అధినేత అవినీతి పరుడు కాదని.. వైఎస్ఆర్‌సీపీ మీడియా విషప్రచారం చేస్తేనో, వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తేనో చంద్రబాబు తప్పు చేసినట్టుకాదని స్పష్టం చేశారు.
ఐటీ నోటీసులకు చంద్రబాబు సమాధానం
చంద్రబాబుకు వచ్చిన ఐటీ నోటీసులపై ఇప్పటికే సమధానం పంపాలని బొండా ఉమ స్పష్టం చేశారు. చంద్రబాబు వద్ద గతంలో పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాలపై అప్పుడే అసెస్‌మెంట్ ఆర్డర్ ఇవ్వడంతో ఐటీ విభాగం సంతృప్తి చెందిందని తెలిపారు. ఏమీ లేనిదాన్ని ఉన్నట్టు చిత్రీకరిస్తూ, విషప్రచారంతో ప్రజల్ని నమ్మించడం జగన్ మోహన్ రెడ్డికి, అతని కుటుంబానికి బాగా అలవాటేనని విమర్శించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు అవినీతి చేశారంటూ హౌస్ కమిటీలు వేసి, ఏమీ నిరూపించలేక భంగపడ్డారన్నారు. జగన్ తల్లి విజయమ్మ కోర్టుల్లో కేసులు వేసి, ఆధారాలు చూపలేక వాటిని వెనక్కు తీసుకున్నారని గుర్తు చేశారు.
రూ. 6 లక్షల కోట్ల అవినీతి చేశారన ఆరోపణలు - ఈ నాలుగేళ్లలో ఏం నిరూపించారు ?
ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు రూ. 6 లక్షల కోట్ల అవినీతి చేశారని, తప్పుడు సమాచారంతో పుస్తకాలు ముద్రించిన జగన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో ఏం నిరూపించారని బొండా ఉమ వైఎస్ఆర్‌సీపీని ప్రశ్నించారు. ప్రజల్లో తనపై పెరుగుతున్న అసంతృప్తిని కప్పిపుచ్చడానికే జగన్ రెడ్డి.. చంద్రబాబుకు ఐటీ నోటీసులని దుష్ప్రచారం మొదలెట్టారని మండిపడ్డారు. అవినీతి పునాదులపై పుట్టిన వైసీపీ.. దోపిడీ సొమ్ము నుంచి పుట్టిన సాక్షి మీడియా.. చంద్రబాబు, టీడీపీపై దుష్ప్రచారంతో శునకానందం పొందుతోందని బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. అవినీతి సామ్రాట్ జగన్ రెడ్డి నీతిమాలిన చరిత్ర విషపు మీడియా, బ్లూమీడియా, వైసీపీ నేతలకు తప్ప దేశమంతా తెలుసునని అన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ మచ్చా, ఎలాంటి అవినీతి మరక లేని ఏకైక నాయకుడు దేశంలో చంద్రబాబు ఒక్కరేనని స్పష్టం చేశారు.
తనను రెండు, మూడు రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న చంద్రబాబు
రెండు, మూడు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చంద్రబాబు అనంతపురంలో వ్యాఖ్యానించారు. నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ అరాచక పాలన అంతం కోసం ఇంటికొకరు తనతో పాటు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. తనపై కూడా దాడి చేస్తారని అన్నారు. ఎన్ని చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. మహాభారతం, రామాయణంలో ధర్మం గెలిచినట్టు చివరకు మనమే గెలుస్తామని అన్నారు. గతంలో ఎప్పుడూ రాని మెజార్టీ ఈ ఎన్నికల్లో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.