JC Prabhakar Reddy : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఓ పిచ్చోడు, మళ్లీ రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి
JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మె్ల్యే పెద్దారెడ్డిపై మళ్లీ ఫైర్ అయ్యారు. పెద్దారెడ్డి ఓ పిచ్చోడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
JC Prabhakar Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒక పిచ్చోడంటూ మండిపడ్డారు. తనపై తప్పుడు కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా వాహనం రిజిస్ట్రేషన్ చేయాలంటే చట్టప్రకారం ఉండాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలన్నారు. మరి అధికారులు నకిలీ పత్రాలతో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించారు. మళ్లీ నకిలీ బీమాపై కేసు పెట్టాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పడం అవివేకమన్నారు. తాము కొనుగోలు చేసిన సమయంలో 63 వేల వాహనాలు అశోక్ లైలాండ్ అమ్మకాలు సాగించిందన్నారు. స్క్రాప్ అన్నప్పుడు విడిభాగాలు అమ్మాలని, మా వద్ద పుల్ వాహనానికి జీఎస్టీ కట్టించుకున్నారని తెలిపారు. ఇటీవల 22 వేల కార్లు హిమాచల్ ప్రదేశ్ లో పట్టుకున్నారని, మరి ఈ విషంలో ఎవరిపైనా కేసులు పెట్టలేదన్నారు. దేశంలో ఒక్క ప్రభాకర్ రెడ్డి మినహా ఎవరి పైనా కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తన వాహనాలు 28 అయితే 156 కేసులు పెట్టారని మండిపడ్డారు. ఇప్పటికే తాను 156 రోజులు జైలుకి వెళ్లి బాధపడి వచ్చానన్నారు.
మీసం తిప్పి, తొడ కొట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి
దమ్ము ధైర్యం ఉంటే నకిలీ ఇన్సూరెన్స్ లపై కేసులు పెట్టాలని జేసీ ప్రభాకర్ రెడ్డి మీసం తిప్పి, తొడ కొట్టారు. అప్పుడు మొత్తం అధికారులంతా కేసుల్లో ఇరుక్కుంటారన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒక పిచ్చోడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంట్లో పిచ్చోళ్ళు ఉన్నారని, వాళ్ల తమ్ముడు ఎక్కడున్నారో చెప్పాలన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే బైక్ రేస్ లు, గుర్రాల రేస్ లు చేసుకోవాలని హితవు పలికారు. ఆయన తన నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ చేసుకోవాలన్నారు. అంతే కానీ ఇతర నియోజకవర్గాల్లో జోక్యం సరికాదన్నారు.
అసలేంటి వివాదం?
సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 కేటగిరి వెహికల్స్‌ను జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి బ్రదర్స్ కొని అక్రమాలకు పాల్పడ్డారనేదే కేసు. 154 వాహనాలను జటాధర ఇండస్ట్రీస్ పేరుతో కొంటే... 104 వాహనాలను గోపాల్‌రెడ్డి అండ్‌కో పేరుతో కొనుగోలు చేశారు. వీటిని నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించి బీఎస్-4 వెహికల్స్‌గా ఎన్‌వోసీ పొందారు. నాగాలాండ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో రీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లో 101, తెలంగాణలో 33, కర్నాటకలో 15, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కొక్కటీ రిజిస్ట్రేషన్ చేయించి రోడ్లపై నడిపారు. వాహనాలకు అనుమతి తీసుకున్న దగ్గరి నుంచి లైసెన్స్‌లు పొందడం, బీమా కోసం అన్ని చోట్ల నకిలీ పత్రాలతో కథ నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఎన్‌వోసీ పొందిన వాహనాలను కొన్ని రోజులు తిప్పిన తర్వాత వేరే రాష్ట్రాలకు చెందిన వారికి అమ్మేసేవాళ్లు.
ఇలా వెలుగులోకి వచ్చిన నేరం
ఇలా వివాదాస్పందంగా ఉన్న వాహనాలను కొన్న యజమానులు తీవ్రం నష్టపోయేవారని విమర్శలున్నాయి. అలా నష్టపోయిన వారిలో కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ అయింది. అప్పుడు జరిగిన విచారణలో మొత్తం వ్యవహారం వెలుగుచూసింది. విచారణలో భాగంగా పోలీసులు నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రికార్డులు పరిశీలిస్తే అక్కడ కూడా నకిలీ పత్రాలు దొరికాయి. దీంతో అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు 2020 జూన్‌లో కేసులు పెట్టారు. ఎఫ్‌ఐఆర్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డితోపాటు 23 మందిని చేర్చారు. కేసు విచారణలో భాగంగా ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని అరెస్టు చేసి జైలుకి కూడా పంపించారు. వాళ్లిద్దరు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినందున ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పలువురు ఆఫీసులు, ఇళ్లలో సోదాలు చేసింది. ఆ విచారణలో భాగంగా ఆస్తులు కూడా అటాచ్ చేసింది.