Kethireddy Pedda Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి డిప్రెషన్ లో ఉన్నారు, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర విమర్శలు
Kethireddy Pedda Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. కలెక్టర్ పై జేసీ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
![Kethireddy Pedda Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి డిప్రెషన్ లో ఉన్నారు, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర విమర్శలు Tadipatri Mla kethireddy pedda reddy fires on JC Prabhakar reddy collector issue DNN Kethireddy Pedda Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి డిప్రెషన్ లో ఉన్నారు, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర విమర్శలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/08/abb6a593ae54d5699958a4dfd74080ad1667904303160235_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kethireddy Pedda Reddy : తాడిపత్రి రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. స్పందన కార్యక్రమంలో అనంతపురం కలెక్టర్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒక మహిళా కలెక్టర్ తో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరించిన తీరు సరికాదని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. స్పందనలో అర్జీలు ఇచ్చిన తర్వాత సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ కు అర్జీ ఇవ్వక మునుపే పేపర్లు విసిరి కొట్టారని ఆరోపించారు. కలెక్టర్ తో ఎలాప్రవర్తించాలో కూడా తెలియని వ్యక్తి.. 30 సంవత్సరాలు రాజకీయాలు ఎలా చేశారో అర్థం కావడం లేదన్నారు. తాడిపత్రిలో పోలీసు అధికారులపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి అని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. కలెక్టర్ పై దురుసుగా ప్రవర్తించిన జేసీ ప్రభాకర్ రెడ్డి పై జిల్లా అధికారులు అంతా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా అధికారులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా జేసీ ప్రవర్తిస్తున్నారన్నారు. తాము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లేదన్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రభుత్వ భూమిని ఆరుసార్లు రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత జేసీ ప్రభాకర్ రెడ్డి దే అని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోపించారు.
ప్రజలకు అంతా తెలుసు
"జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందన కార్యక్రమంలో కలెక్టర్ తో అనుచితంగా ప్రవర్తించారు. జేసీ స్పృహ కోల్పోయి మాట్లాడారు. ఒక కలెక్టర్ తో ఎలా ప్రవర్తించాలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలియకపోవడం దురదృష్టకరం. వ్యవస్థలు ఎలా పనిచేయాలో అధికారులకు తెలియదా?. జేసీ ఏమైనా గ్రూప్ 1 రాశారా? గత ప్రభుత్వం చేసిన నేరాలన్నీ బయటపడ్డాయని బాధతో ఇలా ప్రవర్తిస్తున్నారు. ఎవరో సలహాలు ఇస్తుంటే జేసీ ఇలా ప్రవర్తిస్తున్నారు. తాడిపత్రి ప్రజలు అంతా తెలుసు. జేసీ డిప్రెషన్ లోకి వెళ్లి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు."- ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
ఉద్యోగులు ఆందోళన
స్పందన కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా ఉద్యోగులు నిరసన వ్యక్తంచేశారు. సోమవారం రాత్రి కలెక్టరేట్ వద్ద జిల్లా అధికారులు, ఏపీ రెవెన్యూ అసోసియేషన్, ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగుల ఆందోళన చేశారు. స్పందనలో ఇచ్చే అర్జీలను జాయింట్ కలెక్టర్, కలెక్టర్లు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని ఉద్యోగులు తెలిపారు. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉద్యోగులు పనిచేయరన్నారు. నిబంధనల మేరకు కలెక్టర్ వ్యవహరిస్తున్నారన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన భూ వివాదంలో అధికారుల ఉత్తర్వులకు సివిల్ కోర్టు కూడా సమర్థించిందన్నారు. అయినా స్పందనలో కలెక్టర్‌తో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరించిన తీరు అభ్యంతరకరం అన్నారు. తక్షణమే కలెక్టర్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ పై జేసీ ఫైర్
టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. నువ్వు కలెక్టర్‌గా పనికిరావంటూ కలెక్టర్ నాగలక్ష్మీపై విమర్శలు చేశారు. కలెక్టర్ ముందు పేపర్లు విసిరేశారు. బీకేర్ ఫుల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమంలో సమస్యపై ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక స్పందన ఎందుకు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ తననే బయటికి వెళ్లమని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఒక ప్రజా ప్రతినిధి అయిన నన్నే బయటికి వెళ్లమంటారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మాజీ ఎమ్మెల్యే అయిన తన సమస్యనే పట్టించుకోకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)