Supreme Court: ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ! ఆ కేసుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరణ
రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం పలు అనుమానాలు వ్యక్తం చేసింది.
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పుంగనూరు, అంగళ్లు కేసులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల విషయంలో తాము కలగజేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. భద్రత కల్పించే పోలీసులే.. సాక్షులుగా ఎఫ్‌ఐఆర్ ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. పోలీసు అధికారులు గాయపడ్డారని, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు దారుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. పోలీసులే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పోలీసులే సాక్షులుగా ఉంటారా అని ధర్మాసనం ప్రశ్నించింది.
హైకోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి దానిలో జోక్యం చేసుకోడానికి ఏమీ లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు వేరు వేరు పిటషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
అంగళ్లు ఘటనలో తెలుగుదేశం నేతలపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం తెలుగుదేశం నేతలకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 6 వేర్వేరు పిటిషన్లు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. టీడీపీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబు, నల్లారి కిషోర్ కుమర్ రెడ్డిలకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. చల్లా బాబుకు వ్యతిరేకంగా నాలుగు పిటషన్లు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది.