Supreme Court : ఎన్జీటీ తీర్పు యాథాతథంగా అమలు చేయాల్సిందే - అక్రమ ఇసుక తవ్వకాలపై ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
Andhra News : ఇసుక తవ్వకాల విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్ిట షాక్ తగిలింది. ఎన్జీటీ ఆదేశాలను ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
Andhra Sand Issue : అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని అనుమతులు ఉన్న చోట కేవలం మాన్యువల్ గా మాత్రమే ఇసుకను తీయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అక్రమాలకు పాల్పడిన వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎన్జీటిని సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్రమ ఇసుక తవ్వకాలు జరపడం లేదని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కాంట్రాక్ట్ సంస్థ జేపీ వెంచర్స్‌కు కూడా ఆదేశాలు జారీచేసింది.
ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలన్న పిటిషనర్
పిటీషనర్ నాగేంద్ర కుమార్ అక్రమ ఇసుక తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించింది. పిటీషనర్ ఫిర్యాదులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసం ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చట్టాల మేరకు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినా చర్యలు తీసుకోవాలని ఆదేసించింది. తదుపరి విచారణ మే 10కి వాయిదా వేసింది. ఎన్నికలు ఉన్నందున అఫిడవిట్ దాఖలుకు సమయం ఎక్కువ కావాలని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. కానీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికల కన్నా పర్యావరణ అంశాలే ముఖ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఎన్జీటీ విచారణలో తేలింది ఏమిటంటే ?
రాష్ట్రంలో కేవలం 40 రీచ్‌లలో మాత్రమే మాన్యువల్ మైనింగ్ కు అనుమతి ఉంది. అయినా, 500పైగా రీచ్‌లలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ నెల 19వ తేదీన మేం పర్యటించిన సమయంలో గోదావరి నది వద్ద అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతోందని ఎన్జీటీ విచారణలో తేలింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో జేసీబీలతో తవ్వకాలు సాగిస్తుండటాన్ని గుర్తించాం.గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక మైనింగ్ జరుగుతోంది. ఈ ఏడాది జనవరి 17, 19 తేదీల మధ్య మేం పరిశీలించినప్పుడు... జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దాదాపు 2.2 టన్నుల కెపాసిటీ బకెట్ సైజ్‌లు కలిగిన జేసీబీ, హిటాచీ యంత్రాలతో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతోంది. రోజంతా ఎడతెరిపి లేకుండా ఈ తవ్వకాలు సాగుతున్నాయి. తవ్వకాలు జరుగుతున్న రీచ్‌లలో ఏ ఒక్కదానికీ పర్యావరణ అనుమతులు లేవు. రీచ్‌ల ఏర్పాటుకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతులూ తీసుకోలేదు. గనుల శాఖ నుంచి సంబంధిత రీచ్‌లను లీజుకు తీసుకున్నట్లు కూడా లేదని గుర్తించింది.
ఇవీ ఎన్జీటీ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ గత ఏడాది తీర్పు ఇచ్చింది. మొత్తం 110 ఇసుక రీచ్‌లలో వెంటనే తవ్వకాలు నిలిపేయాలని ఆదేశించింది. ఇసుక తవ్వకాలపై నాగేంద్రకుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. సుప్రీం కోర్టు ఆదేశాలను ఎన్జీటీ తన తీర్పులో పేర్కొంది. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కేవలం అరణియార్ నదిలోని పద్దెనిమిది ఇసుక రీచ్‌లకే పరిమితం కాదని వెల్లడించింది. తమ అదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, ట్రైబ్యునల్ తీర్పుకు వక్రభాష్యం చెప్పిందని అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర పర్యావరణ అంచనా కమిటీ ఉత్తర్వులను అమలు చేయాలని ఎన్జీటీ పేర్కొంది. పర్యావరణ అనుమతులు తీసుకునే వరకు తవ్వకాలు చేపట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది.
ఇసుక అంశం ఏపీలో ఎప్పుడూ సంచలనంగా మారుతోంది. తాజాగా ఉత్తర్వులతో ఎన్నికల సమయంలో ఏపీ ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారనుంది.