Renuka Vs Kodali : కొడాలి నానిపై పోటీకి రేణుకా చౌదరి సై - అసెంబ్లీలో అలా అన్నారని ఫైర్ బ్రాండ్ నిర్ణయం !
వచ్చే ఎన్నికల్లో గుడివాడలో ఎవరూ ఊహించని వారి మధ్య పోటీ జరగనుంది. కొడాలి నానికి పోటీగా రేణుకా చౌదరి రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
Renuka Vs Kodali : గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ రేణుకాచౌదరి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. తాను ఇంత వరకూ ఎప్పుడూ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదని ఈ సారి గుడివాడ నుంచి కాంగ్రెస్ తరపునే పోటీ చేస్తానని ప్రకటించారు. రేణుకాచౌదరి ప్రకటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. రేణుకా చౌదిర ఈ ప్రకటన చేయడానికి కారణం.. గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. అసెంబ్లీలో మూడు రాజధానుల అంశంపై జరిగిన చర్చలో ఆమెపై విమర్శలు చేయడమే. ఖమ్మంలో కార్పొరేటర్‌గా కూడా గెలవలేని రేణుకా చౌదరి అమరావతి రైతులకు మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు. కొడాలి నాని వ్యాఖ్యలు వైరల్ కావడంతో రేణుకా చౌదరి స్పందించారు.
కొడాలి నాని వ్యాఖ్యలతో గుడివాడ వైపు రేణుకా చౌదరి చూపు
తనకు ఏపీ రాజకీయాలపై ఇప్పటి వరకూ ఆలోచన లేదని.. కానీ తనను కొడాలి నాని విమర్శించారు కాబట్టి గుడివాడలోనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు. తనకు తెలుగుదేశం పార్టీ మద్దతు కూడా అక్కర్లేదనన్నారు. తాను అమరావతి రైతులకు మాత్రమే మద్దతు తెలిపానని టీడీపీకి కాదని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. కొడాలి నాని లారీలు కడుక్కునే సమయంలోనే తాను కార్పొరేటర్‌గా ఎన్నికయ్యానని గుర్తు చేశారు. కొడాలికి తన చరిత్ర తెలియదని గూగుల్‌లో సెర్చ్ చేస్తే- తానేమిటో తెలుస్తుందని అన్నారు. అసెంబ్లీలో తన పేరు ప్రస్తావించి.. కోట్లు ఖర్చు పెట్టి చేసుకున్నా రాని ప్రచారం తెచ్చిపెట్టారని దానికి ధ్యాంక్స్ అని సెటైరిక్‌గా కొడాలి నానిపై కామెంట్లు చేశారు.
తనకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చారని కొడాలి పై రేణుకా చౌదరి సెటైర్లు
ఖమ్మంలోనే గెలవలేనంటూ కొడాలి నాని సవాల్ చేశారని, అందుకే తాను ఆయన నియోజకవర్గం గుడివాడ నుంచే పోటీ చేస్తానని తేల్చేశారు.తన కేరీర్‌లో ఇప్పటివరకు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదని, ఇప్పుడా కొరతను గుడివాడతో తీర్చుకుంటాననీ చెప్పారు. కార్పొరేటర్, ఎంపీ, కేంద్ర మంత్రిగా పని చేశానే తప్ప ఎమ్మెల్యేగా లేనని అన్నారు. గుడివాడలో తాను గెలిచి చూపిస్తానని, ఆ తరువాత కొడాలి నానిని మళ్లీ ఓటర్లు ఎన్నుకోరని జోస్యం చెప్పారు. కొడాలి నాని వచ్చి ఖమ్మం జిల్లా గల్లీల్లో తిరిగి చూస్తే తానేంటో, తన శక్తి సామర్థ్యాలేమిటో ఆయనకు బోధపడుతుందని రేణుకా చౌదరి అన్నారు.
నిజంగా పోటీ చేస్తే గుడివాడ ఎన్నిక ఇంట్రెస్టింగే
రేణుకా చౌదరి ఆషామాషీగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరని.. గుడివాడలో పోటీ చేసే ఉద్దేశంతోనే అలాంటి వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. నిజానికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు. అయితే పోటీ పార్టీల మధ్య కాకుండా వ్యక్తుల మధ్య అన్నట్లుగా సాగితే.. ఓటర్లు పోలరైజ్ అవుతారు. గుడివాడలో కొడాలి నానికి సరిపోయే లీడర్ దొరికితే.. అప్పుడు హోరాహోరీగా పోరు ఉంటుందని భావిస్తున్నారు. ఈ ధీమాతోనే గుడివాడలో పోటీ చేయాలని రేణుకా చౌదరి భావిస్తున్నారని.. అందుకే మీడియాను పిలిచి మారీ కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు. ఒక వేళ నిజంగానే రేణుకా చౌదిరి కొడాలి నానిపై పోటీకి దిగితే .. ఆ నియోజకవర్గ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి.