Ramya Murder Case: రమ్య హత్య కేసు.. 24న ఏపీకి రానున్న జాతీయ ఎస్సీ కమిషన్ బృందం..
గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కేసులో వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం ఈ నెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానుంది.
గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కేసులో వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానుంది. జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దర్, సభ్యులు అంజుబాల, సుభాష్ పార్థి ఈ నెల 24వ తేదీన గుంటూరుకు రానున్నట్లు జిల్లా అధికారులకు సమాచారం అందింది. 24న ఉదయం 11 గంటలకు రమ్య హత్య జరిగిన ప్రాంతాన్ని బృంద సభ్యులు పరిశీలించనున్నారు. ఆ తర్వాత బాధిత కుటుంబసభ్యులను కలిసి.. వారితో మాట్లాడతారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ సహా ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.
అసలేం జరిగింది?
ఏపీలో ఆగస్టు 15వ తేదీన బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైంది. గుంటూరులోని పెదకాకాని రోడ్డులోని పరమాయికుంటలో టిఫిన్ తీసుకెళ్లేందుకు వచ్చిన రమ్యను ఓ యువకుడు కత్తితో పొడిచాడు. రక్తపు మడుగులో ఉన్న రమ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. రమ్యపై దాడి చేస్తున్న సమయంలో కొందరు స్థానికులు యువకుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ, నిందితుడు స్థానికులను బెదిరించి బైక్‌పై పరారయ్యాడు. దీనికి సంబంధించిన ఫుటేజ్ అక్కడి సీసీ టీవీ కెమెరాలలో రికార్డు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రమ్య ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రమ్యకు పరిచయం ఉన్న యువకుడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావించారు.
ప్రతిపక్షాల ఆందోళనలు..
పోస్టుమార్టం అనంతరం రమ్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు యత్నించే క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. టీడీపీ సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆస్పత్రికి చేరుకొని నిరసన చేపట్టారు. రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రమ్య మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లనివ్వకుండా విపక్ష నేతలు అడ్డుకున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రభుత్వం తరఫున సాయం..
రమ్య కుటుంబ సభ్యులను హోం మంత్రి సుచరిత పరామర్శించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చెక్కును అందజేశారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగానే ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశామని మంత్రి చెప్పారు.
Also Read: Is People Culprits : నడిరోడ్డుపై హత్యలు ! రక్షించని ప్రజలదే నేరమా..?
Also Read: Guntur Student Murder Case: గుంటూరు బీటెక్ స్టూడెంట్ రమ్య హత్య కేసులో తప్పెవరిది?