YSRCP News : వైఎస్ఆర్‌సీపీపై పిల్లి సుభాష్ అసంతృప్తి - కుమారుడికి సీటిస్తేనే పార్టీలో ఉంటారా ?
వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌పై రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఏం జరిగిందంటే ?
YSRCP News : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు బయటపడుతున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఆవిర్బావం నుంచి జగన్‍కు మద్దతుగా నిలిచిన అన్యాయం జరిగిందని పిల్లి అనుచరులు ఆందోళన చెందుతున్నారు. వైసీపీలో తమ వారిని మంత్రి చెల్లుబోయిన వేణు టార్గెట్ చేస్తున్నారని సుభాష్ వర్గం ఆరోపిస్తోంది.
గోదావరి జిల్లాల్లో పార్టీ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్న ఎంపీ మిధున్ రెడ్డి పర్యటనకు పిల్లి సుభాష్ దూరంగా ఉన్నారు. ఆయనకు స్వయంగా ఎం.పి మిథున్ రెడ్డి ఫోన్ చేసారు..అయితే తర్వాత వచ్చి కలుస్తానని మిథున్ రెడ్డికి చెప్పారని సమాచారం..అలాగే రామచంద్రపురం లోనే ఉండి కూడా పార్టీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ తన కుమారుడు సూర్యప్రకాష్ కు టికెట్ ఇవ్వాలని కొరతున్నారు. అయితే రామచంద్రాపురం నుంచి ప్రస్తుతం చెల్లుబోయిన వేణు మంత్రిగా ఉన్నారు.
రామచంద్రాపురం నుంచే పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పిల్లి సుభాష్.గత ఎన్నికలకు ముందు ఆయనను కాదని చెల్లుబోయిన వేణుకు జగన్ సీటిచ్చారు. సుభాష్ చంద్రబోస్ ను మండపేట అభ్యర్థిగా ప్రకటించారు. అయితే రామచంద్రాపురంలో చెల్లుబోయిన వేణు గెలిచారు. కానీ మండపేటలో పిల్లి సభాష్ ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. తరవాత మండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుని .. మంత్రి పదవులకు.. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయించారు. రాజ్యసభ పదవి ఇచ్చారు. తర్వాత మండలి రద్దు నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.
ఇప్పుడు మళ్లీ రామచంద్రాపురం టిక్కెట్ తన కుటుంబానికి కేటాయించాలని ఆయన పట్టుబడుతున్నారు. మండపేటకు మరో నేత త్రిమూర్తులును ఇంచార్జ్ గా నియమించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బోస్ కుటుంబానికి టిక్కెట్ దక్కే చాన్స్ లేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుభాష్ చంద్రబోస్ అనుచరులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని తన అనుచరులకు పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
నియోజకవ వర్గంలో నెలకొన్న పరిస్థితుల్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని పిల్లి సుభాష్ అనుచరులు వాపోతున్నారు. వైసీపీ(YCP) ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‍గా ఉన్న బోస్, కాకినాడ, అమలాపురంలో జరిగిన పార్టీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. నేడు రాజమండ్రిలో జరిగిన సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు.