East Godavari: మూడుగా విడిపోనున్న తూర్పుగోదావరి జిల్లా.. ఇప్పుడు పేర్లపైనే అసలు పంచాయితీ
ఏపీలో జిల్లాల విభజనపై కంటే పేర్లుపైనే అభ్యంతరాలు. ప్రభుత్వం విడుదల చేసిన జిల్లా పునర్విభజన జాబితాలో వినిపిస్తున్న మాటే ఇది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న జిల్లా పునర్విభజన ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. నిన్న అకస్మాత్తుగా మంత్రిమండలి ఆమోదంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారిక ఉతర్వలు కూడా వచ్చాయి.
మంత్రిమండలి ఆమోదించిన జాబితా చూసిన ప్రజలు, ప్రజాప్రతినిధుల్లో భిన్న స్పందన ఉంది. పాలనా సౌలభ్యం కోసం జిల్లాలను విభజించాలని భావించిన ప్రభుత్వం చాలా మార్పులు చేసింది. ఈ విభజనలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు పెద్ద జిల్లాగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా మూడుగా విడిపోనుంది.
మూడుగా విభజిస్తున్న తూర్పుగోదావరి జిల్లా నుంచి కాకినాడ, అమలాపురాన్ని విడగొడుతున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అరకు పార్లమెంటు స్థానంలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం అరకు కేంద్రంగా ప్రకటించే అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి వెళ్లిపోయింది.
రాజమండ్రి కేంద్రంగా పరిపాలన సాగించే తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలైన రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాలతోపాటు పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఉండే రెండు నియోజకవర్గాలు కలపనున్నారు.
ఎప్పటి నుంచో వినిపిస్తున్నట్టుగానే అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు చేయాబోతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అమలాపురం కేంద్రంగా పరిపాలన సాగించే జిల్లాలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలు ఉండనున్నాయి.
కాకినాడ జిల్లాలో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌తోపాటు పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాలు ఉండనున్నాయి.
కొత్త జిల్లాల పేర్లుపై ప్రచారం..
ఇక్కడి వరకు బాగానే ఉన్నా ప్రభుత్వం ప్రకటించిన పేర్లపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పునర్విభజన గనుక జరిగితే అందులో అమలాపురం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ఏనాటి నుంచో డిమాండ్ ఉంది. గతంలో అనేక దళిత, ఇతర సామాజిక సంఘాలు ఎన్నో సందర్భల్లో ఉన్నతాధికారులకు, ప్రజ్పాతినిధులకు వినతిపత్రాన్ని సమర్పించారు. దీనికి కాపు ఉద్యమ నాయకులు కూడా సంఘీభావం తెలిపారు. ముమ్మిడివరంలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముందు ముమ్మిడివరం శాసన సభ్యుడు పొన్నాడ సతీష్ కూడా కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తాజాగా లేఖ రాశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, కృష్ణదేవరాయులు, జీఎంసీ బాలయోగి పేర్లు కొత్తగా ఏర్పడే జిల్లాలకు పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు.
కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్‌తో కోనసీమ దళిత సంఘాలన్నీ ఏకమై ప్రజాప్రతినిధులకు రిప్రజెంటేషన్లు సమర్పించడంతోపాటు ప్రభుత్వం గుర్తించేలా అమలాపురం కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానిస్తున్నారు.
మరికొందరు అయితే కోనసీమగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్న టైంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న సస్పెన్ష్ కొనసాగుతోంది. ఇప్పటికే గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం... అభ్యంతరాలు తీసుకున్న తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోనుంది.